Crop Loan waiver: రుణ మాఫీ కాని రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్..!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల రుణాలు మాఫీ చేస్తోంది. గురువారం మూడో విడత రుణ మాఫీ కూడా పూర్త చేయనున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మూడు విడతల్లో రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. మొదటి దఫాలో రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసింది. రెండో విడతలో రూ.1.50 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేసింది.
తాజాగా మూడో దఫాలో రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. అయితే కొంత మంది రైతులకు మూడు విడతల్లో రుణాలు మాఫీ కాలేదు. భూమి పాస్ బుక్ ఒక పేరు ఉండి.. ఆధార్ లో మరో పేరు ఉండడంతో రుణ మాఫీ కాలేదని చెబుతున్నారు. మరికొంత మంది రైతులకు వివిధ కారణాలతో రుణ మాఫీ కాలేదు. దీంతో సదరు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆందోళనను అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్త చెప్పారు.

సీఎం రేవంత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆయన గొల్కొండలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేశామన్నారు. మూడు విడత ఈ రోజు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే రుణమాఫీ కాని అన్నదాతలు ఎవరూ అధైర్య పడొద్దని.. వారికి త్వరలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణాలు మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications