హైదరాబాద్‌లో కార్నింగ్ కంపెనీ భారీ పెట్టుబడి: గొరిల్లా గ్లాస్ తయారీ ఇక్కడే, 800 ఉద్యోగాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. తాజాగా, మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ రాబోతోంది. భారతదేశంలో మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్ తయారు చేయడానికి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తోంది.
అమెరికా పర్యటనలో భాగంగా కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బేన్, గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రవికుమార్, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ సారా కార్ట్‌మెల్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

దేశంలో.. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కార్నింగ్ సంస్థ నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. సుమారు రూ. 934 కోట్ల పెట్టుబడి వెచ్చించి కార్నింగ్ సంస్థ స్థాపించనున్న స్మార్ట్‌ఫోన్ల గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ ద్వారా 800 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
Happy to share that Corning, one of the world’s leaders in material sciences has decided to invest in Telangana to setup a manufacturing plant to make Gorilla Glass for smartphones, for the first time in India 😊
— KTR (@KTRBRS) September 1, 2023
Investment size of ₹934 Crore will employ 800 people but more… pic.twitter.com/baYUXByFTl
ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మకంగా పెట్టుబడి అని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పంచుకున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించిన సందర్బంగా పలు దిగ్గజ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్(Metlife) కేంద్ర కార్యాలయంలో కేటీఆర్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికా ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న ఈ సంస్థ.. హైదరాబాద్‌లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
న్యూయార్క్‌లో విద్యార్థిగా, ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో మెట్‌లైఫ్ కార్యాలయ భవన రాజసం, నిర్మాణ శైలి తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసేవని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అదే కేంద్ర కార్యాలయంలో ఈరోజు సొంత రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. సమావేశమవడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
మరోవైపు, న్యూయార్క్‌లో గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్ఛేంజ్(GHX) సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజే సింగ్ తమ సంస్థ జీహెచ్ఎక్స్ గురించి తెలిపారు. హెల్త్ కేర్ రంగం డిజిటల్ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించిందని, దీంతో ఇందులోని కంపెనీలు డిజిలీకరణ, ఐటీ ఆధారిత సేవలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.












Click it and Unblock the Notifications