కరోనా వైరస్ భయం..రోడ్డెక్కిన హైదరాబాద్ మేయర్: వరుసగా రెండోరోజు.. తెల్లవారు జామునే!
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ భయాందోళనలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలన యాంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను మూసి వేయించారు. ఇక పారిశుద్ధ్యం దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో- హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ జంటనగరాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరుసగా రెండో రోజు ఆయన ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఖైరతాబాద్, సోమాజీగూడ, రాజ్‌భవన్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఈ తెల్లవారు జాము నుంచే ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో కరోనా వైరస్ జాడలు లేవని, అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బొంతు రామ్మోహన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం మరిన్ని రక్షణ చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే వారందరికి మాస్క్‌లను పంపిణీ చేశామని తెలిపారు. శానిటైజ్‌లను అందజేస్తామని అన్నారు. మాస్క్‌లను ధరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యల వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు.

Recommended Video
జంటనగరాల్లో బొంతు రామ్మోహన్ ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. సోమవారం కూడా ఆయన హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. షాపింగ్ మాల్స్‌ను తనిఖీ చేశారు. నిషేధం ఉన్నప్పటికీ.. కొన్ని షాపింగ్ మాల్స్ తెరిచే ఉన్నాయంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో బొంతు రామ్మోహన్ కొన్ని మాల్స్, మల్టీప్లెక్స్‌లను పరిశీలించారు. వాటి యాజమానులకు కఠిన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications