ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా.: నిమ్స్‌కి ఈటల రాజేందర్, ఇంకా ర్యాగింగా? అంటూ ఫైర్
ఇటీవల సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
హైదరాబాద్: ఇటీవల సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రీతికి ఇంకా ఎక్మో వెంటిలేటర్ పైనే వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.

అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి
ప్రొటోకాల్ ప్రకారం ప్రీతికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. తమ వద్ద ఉన్న మల్టీ డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు, ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి, తన తల్లితో చేసిన ఫోన్ సంభాషణ అత్యంత చర్చనీయాంశంగా మారింది. సీనియర్లంతా ఒక్కటయ్యారని.. సైఫ్ తనను ఏమైనా చేస్తాడని భయంగా ఉన్నట్లు ప్రీతి ఫోన్లో తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించిన ఈటల
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం ప్రీతి చికిత్స పొందుతున్న నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

ఇంకా ర్యాగింగ్ కొనసాగుతోందంటూ ఈటల ఆగ్రహం
రాష్ట్రంలోని మెడికాలేజీల్లో ఇంకా ర్యాగింగ్ కొనసాగుతోందన్నారు. మెడికల్ కాలేజీల్లో పీజీ చదివే అమ్మాయిల మీద సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారని ప్రీతి ఘటనతో స్పష్టమైందన్నారు ఈటల రాజేందర్. ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడల్లా హెచ్ఓడీలే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతి విషయంలో సకాలంలో హెచ్ఓడీ స్పందించి చర్యలు తీసుకునివుంటే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకునేది కాదన్నారు ఈటల రాజేందర్.

ప్రీతి విషయంలో అన్ని వ్యవస్థలు విఫలమయ్యాయన్న ఈటల
చివరకు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఆమె గోడు వెళ్లబోసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ ఘటనపై ప్రీతి తండ్రి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇక్కడ అన్నీ వ్యవస్థలు విఫలమయ్యాయని అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారని తెలిపారు.












Click it and Unblock the Notifications