video: గులాబీ ఒనర్ మెడలో కాషాయం -టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా రేపే -8న బీజేపీలోకి
''తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బాసటగా నిలిచి కొట్లాడి సాధించిన రాష్ట్రంలో గులాబీ జెండాకు ఓనర్లం మేమే. నాపై కొందరు దురుద్దేశపూర్వకంగా చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నారు. ఏది ధర్మమో.. ఏది న్యాయమో ప్రజలకు తెలుసు. ఇన్నాళ్ల నా రాజకీయ జీవితంలో నేను రూ.5 వేలు లంచంగా తీసుకున్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి వైదొలుగుతా. నిజాయితీగా వ్యాపారం చేస్తోన్న నా కుటుంపై చిల్లరమల్లర వాళ్లు చేసే విమర్శలకు ప్రజలే గుణపాఠం చెప్తరు.
మంత్రి పదవి తనకు కులంతో వచ్చిన భిక్ష కాదని, తెలంగాణ ప్రజల కోసం చేసిన ఉద్యమమే మంత్రిని చేసింది'' అంటూ టీఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభంపై 2019, ఆగస్టు 30న హుజూరాబాద్ మీటింగ్ లో ఈటల రాజేందర్ తొలిసారి బహిరంగంగా గళం విప్పారు. సీన్ కట్ చేస్తే దాదాపు రెండేళ్లకు.. గులాబీ జెండాకు ఓనర్ నని చెప్పుకున్న ఈటల కాషాయజెండా ధారణకు సిద్ధమయ్యారు..

ఈటలకు ఘన స్వాగతం..
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్ కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా నిబంధనలను ఉల్లంఘించిమరీ గుంపులుగా చేరిన ఈటల అనుచరులు, మద్దతుదారులు.. పుష్పగుచ్ఛాలు, షాలువాలతో సందడి చేశారు. ఈటల రాజేందర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి...

టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో బీజేపీ హైకమాండ్ పెద్దలు పలువురిని కలుసుకున్న ఈటల గురువారం హైదరాబాద్ రాగా, అక్కడి నుంచి సొంత నియోజకవర్గం హుజూరాబాద్ వెళతారు. శుక్రవారం హుజూరాబాద్ లోనే మీడియా సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు. అనుచరులు, మద్దతుదారుల సమక్షంలో రేపే ఆయన టీఆర్ఎస్ పార్టీకి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈటల వెంట ఏనుగు రవీందర్ రెడ్డితోపాటు టీఆర్ఎస్ కు చెందిన ఐదారుగురు కీలక నేతలు పార్టీ మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇక
ఈనెల 8 లేదా 9న బీజేపీలోకి..
గులాబీ గూటికి శుక్రవారమే గుడ్ బై చెప్పనున్న ఈటల.. ముహుర్తబలం ఆధారంగా ఈనెల 8 లేదా 9వ తేదీల్లో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో ఈటల.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను కలిసి టీఆర్ఎస్ లో తనకు జరిగిన అన్యాయం, పార్టీలో చేరికపై చర్చరించారు. బీజేపీలో ఈటలు తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం ఈటలది అన్ కండీషనల చేరిక అంటున్నారు. మొత్తానికి రెండు దశాబ్దాలపాటు గులాబీ వనంలో కీలకంగా వ్యవహరించి, దానికి తామే ఓనర్లమని భ్రమించి, చివరికి కమళదళంలో చేరిపోనున్నారు ఈటల రాజేందర్.












Click it and Unblock the Notifications