ఘట్‌కేసర్ ఘటన : అంతా కట్టు కథే.. డీసీపీ రక్షితతో అసలు నిజాలు బయటపెట్టిన యువతి...
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఘట్‌కేసర్‌లో యువతిపై అఘాయిత్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ యువతి చెప్పిందంతా పూర్తిగా కట్టు కథ అని పోలీసులు తేల్చారు. కిడ్నాప్,అత్యాచారం ఏదీ జరగలేదని... ఉద్దేశపూర్వకంగానే యువతి ఈ సీన్ క్రియేట్ చేసిందని నిర్దారించారు. మూడు రోజుల నుంచి 100 మంది పోలీసులు కంటి మీద కునుకు లేకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా... తీరా యువతి పోలీసులను పూర్తిగా తప్పుదోవ పట్టించినట్లు తేలింది. తాను చెప్పిందంతా కట్టు కథేనని డీసీపీ రక్షితకు యువతి వెల్లడించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
Recommended Video


నో కిడ్నాప్... ఒంటరిగా అన్నోజిగూడకు...
సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం... బుధవారం(ఫిబ్రవరి 10) సాయంత్రం రాంపల్లి బస్టాండ్ వద్ద బస్సు దిగిన యువతి ఆ తర్వాత ఆర్‌ఎల్ నగర్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే ఆ యువతి చెప్పినట్లు ఆమెను ఏ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేయలేదు. యంనంపేటలో దిగిన ఆ యువతి 4కి.మీ నడుచుకుంటూ వెళ్లి మరో ఆటో ఎక్కి అన్నోజిగూడలో దిగింది. అప్పటికే ఇంటి నుంచి పదేపదే ఫోన్లు వస్తుండటంతో ఆటో డ్రైవర్ ఆపకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నాడని తల్లితో ఫోన్‌లో చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు 6.29గం. సమయంలో పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి,ఘట్‌కేసర్ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

తన దుస్తులు తానే చింపేసుకుని...
యువతి ఎక్కడుందో తెలుసుకునేందుకు పోలీసులు ఆమెకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయని యువతి.. అన్నోజిగూడలోనే చాలాసేపు అటు,ఇటు ఒంటరిగా సంచరించింది. అయితే పోలీసులు తన కోసం గాలిస్తున్నట్లు తెలియడంతో గాబరాపడ్డ యువతి... అన్నోజిగూడ ప్రధాన రహదారి నుంచి 150మీ. లోపల ఉన్న చెట్ల పొదల వైపు పరిగెత్తి అందులో పడిపోయింది. ఆ సమయంలో ఆమె కాలికి గాయమైంది. అనంతరం తన దుస్తులను తానే చింపేసుకుంది. అప్పటికీ పోలీసుల నుంచి కాల్స్ వస్తూనే ఉండటంతో ఇక తప్పదనుకుని లిఫ్ట్ చేసింది. పోలీసులకు లైవ్ లొకేషన్ వాట్సాప్ ద్వారా షేర్ చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. యువతి టాప్ చిరిగిపోయి ఉండటం,ప్యాంట్ కూడా లేకపోవడంతో ఆమె పరిస్థితి చూసి నిజంగానే అత్యాచారం జరిగి ఉండొచ్చునని పోలీసులు భావించారు.

సీసీటీవీ ఫుటేజీతో దొరికిపోయింది...
పోలీసుల విచారణలో యువతి తనకు ఆటోడ్రైవర్,అతని గ్యాంగ్ మత్తు మందు ఇచ్చినట్లు చెప్పింది. ఆమెకు కొంతమంది అనుమానితుల ఫోటోలు చూపించగా.. అందులో ఒకరిని నిందితుడిగా గుర్తించింది. అతనితో పాటు కొంతమంది గ్యాంగ్ కూడా ఉన్నట్లు చెప్పింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే ఆ ఆటోడ్రైవర్ బుధవారం సాయంత్రం ఎక్కడెక్కడ తిరిగాడో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో అతను ఎక్కడా అన్నోజిగూడా వైపు వెళ్లినట్లు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రాంపల్లి బస్టాండ్ వద్ద నుంచి అన్నోజిగూడ వరకూ ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఆ యువతి యంనంపేటలోనే ఆటో నుంచి దిగిపోయినట్లు కనిపించింది.

డీసీపీ రక్షితతో ఒప్పుకున్న యువతి...
యువతి చెప్తున్న విషయాలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను కాస్త గట్టిగా ప్రశ్నించారు. దీంతో డీసీపీ రక్షిత వద్ద ఇదంతా కట్టు కథ అని యువతి వెల్లడించింది. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికే ఇలా అత్యాచార డ్రామాకు తెరలేపినట్లు చెప్పింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని,అత్యాచారం జరగలేదని అంగీకరించింది. తాను ఎవరైతే నిందితుడని చెప్పానో.. అతనితో గతంలో ఆటో చార్జి విషయంలో చిన్న గొడవ జరిగిందని... అది దృష్టిలో ఉంచుకునే అతని పేరు చెప్పానని తెలిపింది. యువతి అసలు నిజాలు బయటపెట్టడంతో.. అప్పటిదాకా ఉరుకుల పరుగుల మీద కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాక్ తిన్నారు. మూడు రోజులుగా కంటి మీద కనుకు లేకుండా దర్యాప్తు చేస్తున్న కేసు చివరకు ఇలా ముగిసిందని మహేష్ భగవత్ వెల్లడించారు. గతంలోనూ ఓసారి ఆమె ఇలాగే కిడ్నాప్ డ్రామా ఆడిందని... ఆమెతో గతంలో సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడు చెప్పాడన్నారు.