హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గేమ్ ఛేంజర్ : గ్రేటర్ సీన్‌లో సీఎం,పీఎం.. గులాబీ బాస్ క్లైమాక్స్ మ్యాజిక్ చేస్తారా..?

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల ప్రచారం దాదాపుగా క్లైమాక్స్‌కి చేరింది. ఇక నవంబర్ 28,29 ఈ రెండు రోజులు మాత్రమే పార్టీలకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. దీంతో చివరి రెండు రోజుల్లో జనం అటెన్షన్‌ను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. ఇందులో భాగంగానే గులాబీ బాస్ కేసీఆర్ శనివారం(నవంబర్ 28) ఎల్బీ స్టేడియం బహిరంగ సభతో జనం ముందుకు రానున్నారు. మరోవైపు బీజేపీ తరుపున ప్రచారానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగుతున్నారు.

అన్నింటికీ మించి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కూడా ఈరోజే కావడం గ్రేటర్ రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. ప్రధానిది అధికారిక పర్యటనే అని చెప్తున్నప్పటికీ.. స్వాగతం పలికేందుకు సీఎం రావొద్దని పీఎంవో కబురు పంపడం బీజేపీ రాజకీయ ఉద్దేశంలో భాగమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తం మీద గ్రేటర్‌లో శనివారం 'షో' ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకరకంగా ఇది గేమ్ ఛేంజర్ అవవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈసారి లైట్ తీసుకోవట్లేదు...

ఈసారి లైట్ తీసుకోవట్లేదు...

దుబ్బాక ఉపఎన్నిక గెలుపు బీజేపీకి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. వెయ్యి ఏనుగుల బలం ఉందనుకున్న టీఆర్ఎస్‌ను అలజడికి గురిచేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే.. గాలివాటపు గెలుపని టీఆర్ఎస్ లైట్ తీసుకుంది. దుబ్బాక ఉపఎన్నికలో గెలుపు కూడా గాలివాటమేనని టీఆర్ఎస్ అంటున్నప్పటికీ.. లోలోపల ఏదో తెలియని అలజడి. గ్రేటర్‌ ప్రచారంలో బీజేపీ దూకుడు చూసి సీన్‌లోకి గులాబీ బాస్ కూడా ఎంటర్ కాబోతున్నారు. గత 2016 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా.. ప్రచారం చివరలో కేసీఆర్ కేవలం ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఈసారి బహిరంగ సభతో జనం ముందుకు వస్తున్నారంటే ప్రత్యర్థిని ఆయన లైట్ తీసుకోవట్లేదని అర్థమవుతోంది.

సీఎం,పీఎం... క్లైమాక్స్ ఎంట్రీ

సీఎం,పీఎం... క్లైమాక్స్ ఎంట్రీ

బీజేపీ తరుపున కేంద్రమంత్రులు,ముఖ్యమంత్రులు ప్రచారంలో దిగారు,దిగుతున్నారు. ఆఖరికి ప్రధాని మోదీ కూడా అకస్మాత్తుగా హైదరాబాద్ పర్యటన పెట్టుకున్నారు. ఎన్నికల క్లైమాక్స్‌లో మోదీ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం పరోక్షంగానైనా ప్రభావం చూపించవచ్చునన్నది ఆ పార్టీ వ్యూహమై ఉండవచ్చు. మరోవైపు టీఆర్ఎస్ తరుపున కేటీఆర్ ఒక్కడే ప్రచార బాధ్యతలను తన భుజాలపై మోస్తున్నాడు. 2016లోనూ ఆ బాధ్యతలను తన భుజాల పైనే వేసుకుని పార్టీకి 99 సీట్లు సాధించి పెట్టాడు. కానీ తాజా ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శిస్తున్న దూకుడును ఎదుర్కొనేందుకు ఒక్కడే సరిపోతాడా అన్న అనుమానాలు లేకపోలేదు. అందుకే గ్రేటర్ క్లైమాక్స్‌లో కేసీఆర్ బహిరంగ సభతో ముందుకు వస్తున్నారు.

గులాబీ బాస్ మ్యాజిక్ చేస్తారా..?

గులాబీ బాస్ మ్యాజిక్ చేస్తారా..?

బీజేపీ హిందుత్వ ఎజెండాను ముందుకు తెచ్చి హిందువుల ఓటు బ్యాంకును గంప గుత్తగా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఎన్నికల ప్రచారాన్ని మతం చుట్టూ తిప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆఖరికి ముఖ్యమంత్రి కేసీఆర్... తాను నిఖార్సయిన హిందువునని టీఆర్ఎస్ మౌత్ పీస్ 'నమస్తే తెలంగాణ' ద్వారా ప్రకటించుకునే ప్రయత్నం చేయడం... గ్రేటర్‌లో హిందుత్వ ఎజెండా తీవ్రతను పట్టిస్తోంది. సాధారణంగా కేసీఆర్ సభలంటే జనాల్లో చాలా ఆసక్తి ఉంటుంది... విశ్లేషణ,వ్యంగ్యం,దూకుడు కలబోసిన వాగ్దాటితో ప్రత్యర్థిని తుత్తునియలు చేయడంలో ఆయన ధిట్ట. అయితే హిందుత్వ ఎజెండాను ఎదుర్కొనేందుకు ఆచీ తూచీ మాట్లాడకపోతే మూల్యం భారీగా ఉంటుందన్నది గతంలో కరీంనగర్ సభ కేసీఆర్ అనుభవంలోకి తెచ్చింది. కాబట్టి తాజా సభలో కేసీఆర్ బీజేపీని ఎలా కౌంటర్ చేయబోతున్నారు... సున్నితమైన మత అంశంపై ఎలా స్పందించబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. గులాబీ శ్రేణులు మాత్రం కేసీఆర్ పక్కా మ్యాజిక్ చేస్తారని... ఒకే ఒక్క సభతో జనం మూడ్‌ని మార్చేస్తారని నమ్ముతున్నారు.

Recommended Video

Andhra Pradesh : Disha Mobile App Surpassed 11 Lakh Downloads
ఇద్దరు దాదాపు ఒకే సమయంలో...

ఇద్దరు దాదాపు ఒకే సమయంలో...

మధ్యాహ్నం 4గం. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియం బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 3.40 నిమిషాల‌కు హైద‌రాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయంలో దిగనున్నారు. అక్కడినుంచి సాయంత్రం 4గం.-5 గం. మధ్య , జీనోమ్‌ వ్యాలీలోని భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ‌ను సందర్శిస్తారు. ఆ సంస్థ తయారుచేస్తున్న కోవ్యాక్సిన్‌‌కి సంబంధించి సైంటిస్టులను వివరాలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 5.40 నిమిషాల‌కు ప్ర‌ధాని మ‌ళ్లీ తిరుగు ప్ర‌యాణం అవుతార‌ని తెలుస్తోంది.

English summary
The slightly demoralised cadre of the TRS is back to an optimist mood. They strongly believe that party chief K. Chandrashekar Rao’s public meeting on November 28 will be a game changer. They are sure it will change the trend of the GHMC election campaigns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X