బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు: ‘సీఎం పదవి అంటేనే కేసీఆర్ ఆగమవుతున్నరు’
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా గుర్రంపోడు వివాదాస్పద భూముల వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆ వివాదాస్పద భూముల్లో ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన పలు నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసందే. ఈ క్రమంలో రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

గుర్రంపోడులో ఉద్రిక్తత: కేసీఆర్ మరో మూడేళ్లేనంటూ విజయశాంతి, బండి సంజయ్ హెచ్చరిక

బండి సంజయ్ సహా 21 మందిపై కేసు
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి సహా మొత్తం 21 మందిపై మఠంపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న బొబ్బ భాగ్యరెడ్డితోపాటు మరో ఆరుగురిని సోమవారం కోదాడ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో నల్గొండ జైలుకు తరలించారు.

చిన్నపార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే..
ఇది ఇలావుండగా, బీజేపీ నేత విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘టీఆరెస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లతో, కుట్రలతో అబద్ధపు దుష్ప్రచారాలతో ఎన్నో దుర్మార్గాలు చేసి, ఆ తర్వాత చర్చలని చెప్పి ఆ పార్టీలను తెలంగాణ ఐక్యత పేరుతో విలీనం చేయించి, ఆ పార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే' అని విజయశాంతి దుయ్యబట్టారు.

సీఎం పదవంటేనే ఆగమవుతున్నా కేసీఆర్: విజయశాంతి
‘తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే... ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి నేతలను బండకేసి కొడతానని... పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి తిట్టబట్టిన కేసీఆర్... తన సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అని చెప్పడం విడ్డూరం. అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో? సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన టీఆరెస్ ఎమ్మెల్యేలపై కనీసం ఖండన చెయ్యకపోవడం గమనార్హం' అంటూ విజయశాంతి విమర్శించారు.