హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన, రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా
అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరులతో వర్షం దంచికొట్టింది. వారం రోజుల తర్వాత నగరంలో భారీ వర్షం పడింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ, సోమాజిగూడ, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, కోఠి, అఫ్జల్ గంజ్, జియగూడ, లంగర్‌హౌజ్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. టోలిచౌకి ప్రాంతంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచింది.

అల్పపీడన ప్రభావం
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, రాజేంద్రనగర్, అత్తాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఇక మలక్‌పేట్, దిల్‌షుక్‌నగర్‌లో కుండపోత వర్షం పడింది. ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా కోస్తా ప్రాంతాల పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఇవాళ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తూర్పు-పశ్చిమ ద్రోణి మర్థబన్ గల్ఫ్ మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతం నుండి తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో, రేపు కొన్ని చోట్ల ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులు
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమారంభీం-ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో, భారీ వర్షాలు కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో వచ్చే ఛాన్స్ ఉంది. రేపు భారీ వర్షాలు కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో చాలా జిల్లాలలో, రేపు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉంది.