200కుపైగా ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ రెడీ: ఎప్పుడంటే.? ప్లాట్ల ధరలు ఇలా
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(HMDA) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నగర శివారులోని బాచుపల్లి, మేడిపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్నట్లు వెల్లడించింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ.
బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల్లిలో 85 ప్లాట్లకు మే నెల 22 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటికి మార్చిలో మొదటి విడత కింద కొన్ని ప్లాట్లను విక్రయించింది. దీనికి కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో తాజాగా రెండో విడతలో భాగంగా ఈ రెండు లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ప్రకారం.. బాచుపల్లిలో చదరపు గజానికి రూ. 25వేలు, మేడిపల్లిలో రూ. 32వేలు చొప్పున హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ధరలను నిర్ణయించింది.
కనీస బిడ్ పెంపుదల చదరపు గజానికి రూ. 500 చొప్పున ఉండాలంటూ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ రెండు లేఅవుట్లకు సంబంధించి మరింత సమాచారం కోసం హెచ్ఎండీఏ వెబ్‌సైట్, ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్, ఎంఎస్‌టీసీ ఇండియా వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించింది.
లేఅవుట్‌ల సందర్శనకు, సందేహాల నివృత్తి కోసం.. 7396345623, 9154843213 ఫోన్ నంబర్లను సంప్రదించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు వెల్లడించారు. తాజా ప్లాట్ల వేలానికి కూడా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications