Hyderabad: హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..
దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకుల నుంచి సైబర్ నేరగాళ్లు వేల కోట్లు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. ముఠాలో ఉన్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 435 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు సైబర్ నేరాలు చేసి రూ.7 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈడీ, సీబీఐ అధికారులమని చెప్పి ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా.. వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును ఫ్రీజ్ చేశారు.
కొద్ది రోజుల క్రితం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పోలీసులు రాజస్థాన్‌లో సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. సైబర్ నేరాలతో సంబంధమున్న 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.9 లక్షలకు పైగా పోగొట్టుకున్న విషయం తెలిసింది. బాధితుడిని ఈడీ అధికారి, పోలీసులమంటూ నమ్మించి మోసం చేశారు. కామారెడ్డి పట్టణంలో కిషన్ రావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు.

ఆయనకు కొద్ది రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తను పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. కిషన్ రావు మీపై డ్రగ్స్, మనీలాండరింగ్ కేసు నమోదు అయిందని చెప్పాడు. మీ వద్దకు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని భయపెట్టాడు. మీమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు బదిలీ చేయాలన్నాడు. విచారణ పూర్తయ్యాక డబ్బు తిరిగి ఇస్తామని చెప్పాడు. భయపడి పోయిన కిషన్ రావు దశలవారీగా అవతలి వ్యక్తి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు పంపాడు.
ఇలా రూ.9లక్షల 29వేల రూపాయలు బదిలీ చేశాడు. కొద్ది రోజుల తర్వాత కిషన్ రావు తనకు వచ్చిన ఫోన్ నంబర్ కు ఫోన్ చేశాడు. కానీ ఫోన్ కలవలేదు. దీంతో కిషన్ రావు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కేసు మోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. సీబీఐ, ఈడీ, పోలీసులమని ఫోన్ చేస్తే నమ్మకండి అని కోరారు. అలాగే ఎలాంటి పాస్ వర్డ్ లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications