ఫాక్స్‌కాన్ శంకుస్థాపన చేసిన కేటీఆర్; మొదటిదశలో 25వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటన!!
హైదరాబాద్ సమీపంలో కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక కేంద్రానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు శంకు స్థాపన చేశారు. విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్ధానిక శాసన సభ్యులు ఎం. కిషన్ రెడ్టి, ఫాక్స్ కాన్ చైర్మన్- సిఈవో సిడ్నీ లూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ స్పీడ్ కు తగ్గట్టుగా , ఈరోజు తెలంగాణలో కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ కు చెందిన మొట్టమొదటి ప్లాంట్ లకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒప్పందం చేసుకున్న రెండు నెలల వ్యవధిలోనే భూమి పూజ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణలో చారిత్రాత్మక సందర్భం అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

500 మిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి తో ఫాక్స్ కాన్ సంస్థ మొదటి దశలో 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది అన్నారు. గత తొమ్మిదేళ్ళలో రాష్ట్రం 50 వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించిందని చెప్పారు. ఇంతవరకు 22 వేల బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులకు అనుమతులు ఇచ్చినట్లూ, తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగిందనీ అన్నారు.
దేశంలో లభిస్తున్న ప్రతి మూడు టెక్నాలజీ ఉద్యోగాలలో ఒకటి రాష్ట్రంలో లభిస్తోందని చెప్పారు. 2040 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో గత సంవత్సరం వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాల్లో మూడింటిలో ఒకటి రాష్ట్రంలొనే వచ్చిందని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను అన్నింటిని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇస్తామని ఫాక్స్ కాన్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఒకపక్క కంపెనీ నిర్మాణం జరుగుతుంటే, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని అందుకోసం కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వ ఉద్యోగాలు రెండు శాతమే ఉంటాయని స్వయం ఉపాధి కల్పించడం, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించడంతో రాష్ట్రానికి అపారమైన సంపద సమకూరుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగాన్ని తీసుకున్నా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలోనే దేశ స్థాయిలో తెలంగాణ అందరి మన్ననలు పొందుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications