సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వలేదట ... డ్రగ్స్ కేసులో సిట్ ట్విస్ట్ పెట్టిందిగా..
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది . సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ లో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందికి క్లీన్ చిట్ ఇవ్వలేదని షాకింగ్ విషయాన్ని తెలియజేసింది ఎక్సైజ్ శాఖ .

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఎక్సైజ్ శాఖ
టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ పై సుదీర్ఘ విచారణ తరువాత మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్.. డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే కేసుల్లో చేర్చింది. సినీ అగ్రతారలు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. రవితేజ, చార్మి, పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. అయితే సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చారని పేర్కొంటే ఇక ఈ డ్రగ్స్ కేసులో సినీ నటులకు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ కేసులో మరికొన్ని చార్జీషీట్లు దాఖలు చేస్తామని తేల్చి చెప్పింది.

డ్రగ్స్ కేసు విషయంలో ఎక్సైజ్ శాఖ వివరణ
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్, సిట్ దాఖలు చేసిన చార్జీషీట్లపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభయ్య అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసును నీరు గార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జీషీట్లలో సినీ ప్రముఖుల పేర్లు పేర్కొనలేదు.దీంతో ఈ విషయమై తీవ్రమైన విమర్శలను ఎక్సైజ్ శాఖ ఎదుర్కోవాల్సి వచ్చింది . ఇక ఈ విషయంలోనే ఎక్సైజ్ శాఖ బుధవారం నాడు వివరణ ఇచ్చింది. తమపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడింది.

ఇప్పటికి 7 చార్జ్ షీట్లు దాఖలు చేశాం .. సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు అని వివరణ
డ్రగ్స్ కేసుకు సంబంధించి దాఖలు చేసింది నాలుగు చార్జ్ షీట్లు కాదని ఇప్పటికే ఏడు చార్జీషీట్లు దాఖలు చేసినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మరో ఐదు చార్జీషీట్లు దాఖలు చేయనున్నట్టు సిట్ అధికారులు ప్రకటించారు. సినీ ప్రముఖులకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదని తేల్చి చెప్పింది.అప్పట్లో ఈ కేసు విచారణకు సినీ సెలబ్రిటీల నుండి గోళ్లు, రక్తం, వెంట్రుకలు కూడా సేకరించారు అధికారులు. ఇక ఆ రిపోర్టులు సైతం వచ్చాయని , డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని ఎక్సైజ్ శాఖాధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications