సికింద్రాబాద్ రైల్వే సంచలన నిర్ణయం
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు భారతీయ రైల్వే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగా అనేక మార్పులను ప్రవేశపెట్టింది. ఎక్కువ సమయం క్యూలో నిలబడి టికెట్ తీసుకునే అవకాశం లేకుండా యూటీఎస్ పేరుతో యాప్ తెచ్చిన సంగతి తెలిసిందే. టికెట్ కౌంటర్లలో కూడా చిల్లర కోసం ఇబ్బంది ఏర్పడుతుండటంతో డిజిటల్ లావాదేవీలను అనుమతిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో 31 కౌంటర్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందే అవకాశాన్ని కల్పించారు.
టికెట్ కొనుగోలు చేసే కౌంటర్ల వద్ద డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. బుకింగ్ క్లర్క్ అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ను చూపిస్తారు. దాన్ని ఫోన్ పే, గూగుల్ పే, పీటీఎం, అమెజాన్ పే, భీమ్ యాప్స్ లో ఏదైనా స్కాన్ చేయవచ్చు. తర్వాత టికెట్ జారీ అవుతుంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ , హైదరాబాద్, కాజీపేట , బేగంపేట , వరంగల్ , మంచిర్యాల్, లింగంపల్లి , హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్ లోని 31 కౌంటర్ల ద్వారా ఈ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. జనరల్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినందుకు కమర్షియల్, టెక్నికల్ స్టాఫ్ చేస్తున్న కృషిని అభినందించారు.

దేశవ్యాప్తంగా ప్రధానమైన అన్ని స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్ లైన్ లో రిజర్వేషన్ టికెట్లను పొందడంతోపాటు యూటీఎస్ యాప్ ద్వారా అన్ రిజర్వుడ్ టికెట్స్ కూడా ఆన్ లైన్ లోనే పొందుతున్నారు. ఇప్పుడు టికెట్ బుకింగ్ కౌంటర్లలో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంద్వారా నగదు బదిలీ మరింత సరళీకృతం అవుతోంది.












Click it and Unblock the Notifications