‘మూసీ’ ప్రక్షాళనలో కీలక ముందడుగు: భారీగా నిధులు
హైదరాబాద్ మహా నగరంలోని మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మురికికూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతోంది. మూసీకి పునర్జీవం వచ్చేలా నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 ఎస్టీపీలను నిర్మించనుంది. ఇందుకోసం జలమండలికి పరిపాలన అనుమతులిస్తూ రూ.3,849.10 కోట్లను కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మూసీ నది అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్లో రూ. 1500 కోట్లను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిధులతో మూసీ నది తీరప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్దరించనున్నట్లు తెలిపింది. రాజధాని పరిధిలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల నుంచి డ్రైనేజీ, వ్యర్థాలతో ఏళ్ల తరబడి మూసీనది కాలుష్య కోరల్లో చిక్కిందని, దాన్ని సవాల్ తీసుకొని ప్రక్షాళన దిశగా కార్యచరణ మొదలుపెట్టింది రేవంత్ సర్కారు.

మూడు ప్యాకేజీలుగా 39 ఎస్టీపీలను నిర్మించనున్న సీవరేజ్ బోర్డు : అందులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. తాజాగా అమృత్ 2.0లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను మూడు ప్యాకేజీల్లో నిర్మించి మురుగును మూసీలో కలువకుండా చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 64 కోట్ల రూపాయలతో ఒక ఎస్టీపీ, హామ్ పద్దతిలో 1878 కోట్లతో ప్యాకేజీ-1లో 16 ఎస్టీపీలు, 1906 కోట్లతో ప్యాకేజీ-2లో 22 ఎస్టీపీలను నిర్మించనుంది. ఈ 39 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే 972 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.
ఇది ఇలావుంటే, మూసీ నదికి దక్షిణం వైపున రూ.1297 కోట్ల వ్యయంతో నాలుగు ప్రాంతాల్లో ఐదు శుద్ధి కేంద్రాలు నిర్మాణం జరుగుతోంది. వాటిలో కోకాపేట, మీరాలంలో రెండు కేంద్రాలు అందుబాటులోకి రాగా, ఆయా కేంద్రాల ద్వారా నిత్యం 56.50 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. అలాగే జలమండలి పర్యవేక్షణలో 468 కోట్ల రూపాయల వ్యయంతో నాగోలులో నిర్మించిన అతిపెద్ద ఎస్టీపీ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధమైంది.












Click it and Unblock the Notifications