జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... పోలింగ్,కౌంటింగ్ తేదీలు ఇవే...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్,నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా... డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. బుధవారం(నవంబర్ 17) నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 20గా నిర్ణయించారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. మొత్తం 14 రోజుల్లో డిసెంబర్ 6వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం(నవంబర్ 17) మీడియాకు వివరాలు వెల్లడించారు.
Recommended Video

బ్యాలెట్ పద్దతే... పాత రిజర్వేషన్లే..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారథి తెలిపారు. ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితులు,గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు,ఇతరత్రా టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత బ్యాలెట్ పద్దతిలోనే ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 7గం. నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అబ్జర్వర్స్ రిపోర్ట్ ఆధారంగా రీపోలింగ్‌పై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో డీలిమిటేషన్ లేదని,2016 ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లే అమలవుతాయని చెప్పారు.డీలిమిటేషన్,రిజర్వేషన్లు ప్రభుత్వ పరిధిలోని విషయాలని... రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.2500,మిగతావాళ్లకు రూ.5వేలు డిపాజిట్‌గా నిర్ణయించామన్నారు.

1.1.2020 నాటికి...
ఓటర్ల తుది జాబితా ఈ నెల 13న విడుదల చేశామని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ సహా లోకల్ బాడీ ఎన్నికలకు ప్రత్యేక ఎలక్టోరల్ ఉండదన్నారు. అసెంబ్లీ ఎలక్టోరల్‌నే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 1.1.2020 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్నవారికి జీహెచ్ఎంసీలో ఓటు హక్కు కల్పించినట్లు చెప్పారు. మొత్తం 150 వార్డులకు ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.ఎలక్టోరల్ ఫైనల్ చేసేముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామన్నారు.నవంబర్ 22,మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని పేర్కొన్నారు. ఆరోజే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య,వారికి కేటాయించే గుర్తులపై స్పష్టత వస్తుందన్నారు.

నవంబర్ 19న పోలింగ్ స్టేషన్ల జాబితా..
డీజీపీ,కమిషనర్ స్థాయిలో సమావేశం నిర్వహించి బందోబస్తుపై కూడా చర్చించామన్నారు. ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం దానికి సంబంధించిన ప్లాన్‌లో నిమగ్నమైనట్లు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ల తుది జాబితా సిద్దమవుతుందన్నారు. నవంబర్ 19 వరకు ఈ జాబితా ఫైనల్ అవుతుందని... నవంబర్ 21న ఆ జాబితాను అధికారికంగా ప్రకటిస్తామన్నారు. అప్పటివరకూ పోలింగ్ స్టేషన్ల సంఖ్య ఎంతనేది చెప్పలేమన్నారు.మొత్తం 150 కౌంటింగ్ హాల్స్,150 స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయని చెప్పారు. ఒక్కో కౌంటింగ్ హాల్‌లో 14 టేబుల్స్ ఉంటాయన్నారు. 150 మంది ఆర్వోలు,ఏఆర్వోలు వీటిని పర్యవేక్షిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 3గం.-4గం. వరకూ తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications