మెదక్ లాకప్-డెత్: డీజీపీ సీరియస్, విచారణకు ఆదేశం, బాధ్యులపై చర్యలు
మెదక్ లాకప్-డెత్: డీజీపీ సీరియస్, విచారణకు ఆదేశం, బాధ్యులపై చర్యలు
హైదరాబాద్: మెదక్ పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై డీజీపీ అంజనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఐటీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని.. ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ సూచించారు.
బాధ్యులైన మెదక్ సీఐ, ఎస్ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16వ తేదీన రాత్రి మృతి చెందాడు. దొంగతనం కేసులో ఖదీర్ ఖాన్‌ను తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడని ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జనవరి 27న మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఖదీర్ ఖాన్‌ను జనవరి 29న అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచి, ఆ తర్వాత అతని భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఖదీర్ అనారోగ్యం పాలవ్వడంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ్నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఖదీర్ మృతి చెందాడు. దీంతో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి ఖదీర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
కాగా, మరణించే ముందు ఖదీర్.. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని చెప్పాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా.. వినకుండా ఎస్ఐతోపాటు కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టారని తెలిపాడు. తాను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన తర్వాత తనను విడిచిపెట్టారని పేర్కొన్నాడు.
పోలీసులపై చర్యలు
ఖాదీర్ ఖాన్ మృతి కేసులో ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లను తక్షణమే ఐజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సదరు పోలీసులపై క్రమశిక్షణ చర్యల కోసం ఐజీకి నివేదిక పంపినట్లు ఎస్పీ ప్రియదర్శిని వెల్లడించారు.












Click it and Unblock the Notifications