ఎవరికి వారే: కేసీఆర్-గవర్నర్ తమిళిసై వేర్వేరు సమీక్షలు: క్లౌడ్ బరస్ట్ కుట్ర
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోందంటూ వస్తోన్న వార్తలను మరింత బలపరిచే ఉదంతం ఇది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వారిద్దరూ వేర్వేరుగా పర్యటనలను నిర్వహించారు. బాధితులను పరామర్శించారు. ఒకే రోజు, ఒకే అంశం మీద.. గవర్నర్, సీఎం వేర్వేరుగా సమీక్షలను నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళసై పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక, పునరావాస శిబిరాలను సందర్శించారు. వరద నీటిలో మునిగిన పంట పొలాలు పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గోదావరి పరివాహక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. బాధితులను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పరామర్శించారు.

బాధితులకు పరామర్శ..
మణుగూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న గవర్నర్‌కు ఆర్డీవో స్వర్ణలత, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి స్వాగతం పలికారు.. అనంతరం అశ్వాపురం మండలంలోని వరద ప్రాంతాలలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను తిలకించారు. పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడారు.

సహాయక శిబిరాల్లో..
ఆ సమయంలో పలువురు బాధితులు ఒక్కసారిగా తమ బాధలను వినిపించుకోవడానికి ప్రయత్నించారు. దీనితో కొద్దిసేపు అక్కడ అంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఆమె అందరితో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లయన్స్ క్లబ్ , ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు బ్రెడ్లు, కోడిగుడ్లు, చిన్నారులకు బిస్కెట్లు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భోజన స్టాల్ ని ఆమె ప్రారంభించారు.

క్లౌడ్ బరస్ట్..
కేసీఆర్ కూడా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించారు. అక్కడికక్కడే సమీక్షలు నిర్వహించారు. అధికారులకు తక్షణ ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరికి వరద రావడం వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. క్లౌడ్ బరస్ట్ సంభవించిందనే అనుమానం వ్యక్తం చేశారు. ఇతర దేశాల క్లౌడ్ బరస్ట్ పేరుతో కుట్ర పన్నారని చెప్పారు. గతంలో లఢక్, ఉత్తరాఖండ్ తరహాలో ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ చేశారని ఆరోపించారు.

ప్రాణనష్టం సంభవించకుండా..
గతంలో ఎప్పుడూ లేనటువంటి వరదలు చూస్తున్నామని, దీనికి కారణం క్లౌడ్ బరస్ట్ అయి ఉండొచ్చని అన్నారు. వరదల వల్ల ప్రాణనష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. గోదావరి 50 అడుగులు వచ్చినా కొన్ని కాలనీలు నీట మునుగుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూస్తామని చెప్పారు. ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శాశ్వత కాలనీల కోసం అధికారులు ఎత్తయిన ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications