ఆర్టీసీ సమ్మెకు బ్రేక్.. రెండు రోజుల విరామం.. బస్సులు ఫుల్లుగా నడిచేనా?
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నిర్ణయం మేరకు సమ్మెకు తాత్కాలిక బ్రేక్ పడనుంది. పండుగ నేపథ్యంలో రెండు రోజుల విరామం ప్రకటించారు జేఏసీ నేతలు. దసరా పండుగ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే జేఏసీ నేతల నిర్ణయంతో ఆర్టీసీ సమ్మెకు రెండు రోజుల విరామం ప్రకటించడంతో ఉద్యోగులు సేవలందిస్తారా లేదంటే పండుగ తర్వాత ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటారా అనే విషయం ఇప్పటివరకైతే స్పష్టం చేయలేదు. సాయంత్రం లోపు మరో ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై జేఏసీ నేతలు క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఆర్టీసీ సమ్మెకు రెండు రోజుల విరామం.. ప్రజలకు ఊరట కలుగుతుందా?
దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టింది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లాల్సిన చాలామంది సరైన బస్సులు లేక నానా అవస్థలు పడుతున్నారు. టెంపరరీ స్టాఫ్‌తో ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సులు నడుపుతున్నప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు.
దాంతో గ్రామాలకు వెళ్లాల్సిన నగర వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు రెండు రోజులు బ్రేక్ ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రం వరకు యథావిధిగా బస్సులు నడుస్తాయనే టాక్ వినిపిస్తోంది. తాత్కాలిక బ్రేక్‌తో ఉద్యోగులు విధుల్లో చేరతారా.. వారు వస్తానంటే ప్రభుత్వం ఎలా స్పందించనుంది.. తదితర అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాలు.. మళ్లీ ఏమంటారో..!
మరోసారి ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఐఏఎస్ కమిటీతో కూడా భేటీ కానున్నారు. ఆర్టీసీ సమ్మెపై సునీల్ శర్మ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చానీయాంశమైంది. ఆర్టీసీ సమ్మెకు కార్మిక సంఘాల జేఏసీ రెండు రోజుల విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏవిధంగా స్పందించనున్నారనేది మరో కోణం.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే.. తాడోపేడో తేల్చుకుంటామంటూ..!
అదలావుంటే ఆర్టీసీ సమ్మె చట్టబద్దమైందని మరోసారి గుర్తు చేశారు కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే సమ్మెకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యమాలతో ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన కేసీఆర్.. ఇప్పుడేమో పోరాటాలను అణిచి వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలకు భయపడే ప్రసక్తే లేదని.. ఆయన ఫామ్ హౌస్‌లో పనిచేసే పాలేర్లము కాదని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications