Severe Rainfall Alert: తెలంగాణలో మళ్లీ వాన.. రేపు, ఎల్లుండి
ఓ వైపు పంట చేతికొచ్చే సమయం.. మరోవైపు వర్షం ఉందనే వార్తలతో రైతన్న ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అల్పపీడనం ప్రభావంత వాతావరణం కూడా చల్లగానే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి.. మధ్య ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి మి ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వచ్చే 12 గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.
పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు తీరంకి చేరుకునే అవకాశం ఉంది. ఆ తరువాత సుమారు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి రేపు సాయంత్రం ఉత్తర తమిళనాడు మరియు పరిసర దక్షిణ ఆంధ్రా తీరంలోని కరైకల్, శ్రీహరి కోట మధ్యన కడలూర్ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇవాళ తెలంగాణలో ఈశాన్య దిశ నుండి క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని..రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ, మరియు ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పంట చేతికి వచ్చే సమయంలో కురవనున్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇటు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువే నమోదు అవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సం ఇలానే కొనసాగితే.. ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. పంటలకు వానాకాలం, యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా లభించే పరిస్థితులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications