సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళితే బెటర్..
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలుకుతారు. ఆ వెంటనే బేగంపేట్ నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ పదివేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 12:30కి బేగంపేట నుండి బయల్దేరి జలవిహార్‌లో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా జరిగే సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తారు
యశ్వంత్ సిన్హా పర్యటన నేపథ్యంలో సిటీలో ఆంక్షలు విధించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేపడతారు. పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపు ఉంటుంది. బేగంపేట్ విమానాశ్రయం-లైఫ్ స్టైల్ భవన సముదాయం- సోమాజిగూడ - ఖైరతాబాద్ - ఐమ్యాక్స్ రోటరీ - నెక్లెస్ రోడ్ - జలవిహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే ఛాన్స్ ఉంది.
గ్రీన్ ల్యాండ్స్ నుంచి రాజ్ భవన్ రోడ్ వైపు వచ్చే వాహనాలను మోనప్ప ఐలాండ్ / రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పంజాగుట్ట వైపుగా మళ్ళిస్తారు.
ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద షాదన్ కళాశాల వైపునకు మళ్లిస్తారు.
మినిస్టర్ రోడ్డు నుండి సంజీవయ్య పార్కు వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. నల్లగుట్ట వంతెన వద్ద బుద్దభవన్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపునకు వాహనాలను అనుమతించరు. వాటిని దారి మళ్ళిస్తారు.

మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రోటరీ వైపునుకు అనుమతించరు. ఆ వాహనాలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ వైపునకు మళ్లిస్తారు. పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు బేగంపేట విమానాశ్రయం నుంచి పంజాగుట్ట-కేబీఆర్ పార్క్-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్- రోడ్ నంబరు.36-మాదాపూర్ మీదుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య హెచ్‌ఐసీసీ నోవాటెల్, మాదాపూర్‌కు తరలివెళ్లే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండొచ్చు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని, తమకు సహకరించాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications