వైఎస్ షర్మిల అరెస్ట్ - సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ ముట్టడికి
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ పోలీసులు ఆమెను కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన కారణంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ప్రగతి భవన్‌ను ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో- పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. లోటస్ పాండ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.

పోలీసుల కళ్లు గప్పి..
కొద్దిసేపటి కిందటే వైఎస్ షర్మిల పోలీసుల కళ్లు గప్పి లోటస్ పాండ్ నివాసం నుంచి బయటికొచ్చారు. ప్రగతి భవన్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో ఆమెను పంజాగుట్ట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. సొంతంగా కారును డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్లారామె. కారులో ఒంటరిగా వెళ్లిన విషయం తెలుసుకున్న వెంటనే లోటస్ పాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పంజగుట్టకు చేరుకున్నారు. జై షర్మిలక్క అంటూ నినాదాలు చేశారు.
తీవ్ర ఉద్రిక్తత..
తాను రోజూ వినియోగించే కారులో కాకుండా- పార్టీ నాయకుల కారులో ఆమె లోటస్ పాండ్ నుంచి బయటికి వచ్చారు. మార్గమధ్యలో కారు మారారు. సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో అద్దాలు పగిలిన కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. పంజాగుట్ట జంక్షన్ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకుని, అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను అడ్డుకోవడానికి వైఎస్ఆర్టీపీ నాయకులు పిట్ట రామిరెడ్డి, ఇతర కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
కాన్వాయ్‌పై దాడి..
ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు సోమవారమే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. షర్మిల కాన్వాయ్‌లోని వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం, రాళ్లు రువ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తరలించారు. దీనికి నిరసనగా ఇవ్వాళ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు వైఎస్ఆర్టీపీ నాయకులు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. ముఖానికి గాయాలయ్యాయి.
ఎమ్మెల్యేపై విమర్శలు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈ దాడికి దిగారు. వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలను చించి వేశారు. వాటికి నిప్పటించారు. షర్మిల కాన్వాయ్‌లోని కారు అద్దాలను పగులగొట్టారు. అదే కారును ఇప్పుడామె పంజాగుట్ట వద్ద వినియోగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే తన పాదయాత్రను అడ్డుకుందని మండిపడ్డారామె.
కేసీఆర్ నియంత వైఖరి..
పాదయాత్రలో బస్సును తగులబెట్టడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకునే తాము పాదయాత్ర చేస్తున్నామని, శాంతిభద్రతల బూచిగా చూపించి తనను అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ- తన పాదయాత్ర ఆగబోదని తేల్చి చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ వైఖరికి ఇది నిదర్శనమని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications