తారకరత్న భౌతికకాయానికి వైఎస్ షర్మిల నివాళి
అమరావతి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కిందటి నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించారు. మోకిలలోని స్వగృహంలో నివాళి అర్పిస్తోన్నారు.
తారకరత్న మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, నారా లోకేష్ నివాళి అర్పించారు. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కన్నీరు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు.

తాజాగా- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తారకరత్న భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం ఆమె లోటస్ పాండ్ నివాసం నుంచి కారులో మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట పార్టీ నాయకులు పిట్ట రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
అనంతరం తారకరత్న భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, కూతురిని ఓదార్చారు. అనంతరం తారకరత్న దగ్గరి బంధువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డిని కలుసుకున్నారు. తారకరత్న మరణానికి దారి తీసిన పరిస్థితులు, బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో అందించిన వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

కాగా- మోకిలలోని నివాసం నుంచి తారకరత్న భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications