10 లక్షల ఉద్యోగాలు, 15 లక్షల ఆరోగ్య బీమా: జార్ఖండ్‌లో ఇండి కూటమి మేనిఫెస్టో ఇదే
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడిన వేళ ఇండియా కూటమి మంగళవారం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే యువతకు 10 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక, పలు సంచలన హామీలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది.
ఇండియా బ్లాక్ '7 గ్యారెంటీస్' పేరుతో జార్ఖండ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ పార్టీ నేత జేపీ యాదవ్ ఉమ్మడిగా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకుగాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని తెలిపింది. ప్రధానంగా ఎస్టీలకు 28 శాతం, ఎస్సీలకు 12 శాతం, ఓబీసీలకు 27 శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొంది. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఎస్టీలకు 26 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఓబీసీలకు 14 శాతం వరకు రిజర్వేషన్లు ఉన్నాయి.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. పేదలకు ఇస్తున్న రేషన్‌ను 5కేజీల నుంచి 7 కేజీలకు పెంచుతామని ఇండియా బ్లాక్ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే కేవలం రూ.450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది.
ఈ సందర్భంగా మోడీ నేతృత్వంలోని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలు ఎప్పటికీ నెరవేరవని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
మరోవైపు, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవలే బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. 'గోగో దీదీ పథకం' కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థిక భరోసా ఇస్తామని ప్రకటించింది. దీపావళి, రక్షాబంధన్ కానుకగా ఏడాదికి ఉచితంగా రెండు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని పేర్కొంది. జార్ఖండ్ యువతకు 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో సహా 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
కాగా, 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications