కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని రోడ్డు పక్కనే వదిలేసిన 108 సిబ్బంది: ప్రెస్‌ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని 108 సిబ్బంది రోడ్డు పక్కనే వదిలేశారని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

కరోనాతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసిన వ్యక్తి మృతదేహాన్ని 108 సిబ్బంది రహదారి పక్కన వదిలేసిన ఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకుళ్ల సమీపంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన షేక్‌ సుభాని (40) కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు.

మంగళవారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు.

వారు చికిత్సకు తీసుకెళుతుండగా మధ్యలో వంతెన సమీపంలో కన్నుమూశారు. దీంతో సిబ్బంది మృతదేహాన్ని రహదారి పక్కన వదిలి వెళ్లారని ఈనాడు రాసింది.

రెండు గంటల పాటు అలా అది రోడ్డు పక్కన ఉన్న విషయం తెలుసుకున్న ఎస్సై సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పోలీసులు, సచివాలయ సిబ్బంది సుభాని మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారని ఈనాడు వివరించింది.

తగ్గిన కేసుల సంఖ్య

తగ్గిన కేసులు, పెరిగిన రికవరీ

దేశంలో నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య కంటే కోలుకునేవారి సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల తగ్గుదల ప్రారంభమైందని.. మహమ్మారి సెకండ్‌ వేవ్‌ క్షీణతకు ఇది సూచిక అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇటీవల వరకు రెండో దశ ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మరో 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం వైరస్‌ నెమ్మదించిందని తెలిపింది.

అయితే, దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలో కేసుల పెరుగుదల కొనసాగుతోందని వివరించింది.

కరోనా ప్రారంభం నుంచి దేశంలో రోజువారీ అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. మధ్యలో అతి కొద్ది రోజులు కేరళలో ఎక్కువ పాజిటివ్‌లు వచ్చాయి.

ఫిబ్రవరి మధ్య నుంచి ప్రారంభమైన సెకండ్‌ వేవ్‌లో మాత్రం మొదటి నుంచి మహారాష్ట్రలోనే గరిష్ఠ సంఖ్యలో కేసులు వచ్చాయి.

తాజాగా కర్ణాటక పాజిటివ్‌లతో పాటు మరణాల్లోనూ మహారాష్ట్రను అధిగమించింది. సోమవారం కర్ణాటకలో 39,305 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా, 596 మంది చనిపోయారు.

మహారాష్ట్రలో 37,236 కేసులు రాగా, 549 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశ రాజధానిలో మూడు వారాలుగా లాక్‌డౌన్‌ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గినట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించే అవకాశం కనిపిస్తోందని ఆంధ్రజ్యోతి వివరించింది.

కేటీఆర్ నేతృత్వంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్

తెలంగాణలో కోవిడ్ నియంత్రణ, టీకా, మందుల అవసరాలు పర్యవేక్షించడానికి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసినట్లు నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.

రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌పై పోరాటాన్ని తీవ్రం చేసింది.

ఒకవైపు లాక్‌డౌన్‌ విధించడమే కాకుండా.. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సీన్‌, బాధితుల వైద్యానికి మందులు, ప్రాణాల రక్షణకు ఆక్సిజన్‌ కొరత రాకుండా రోజువారీగా పర్యవేక్షించేందుకు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రానికి రోజువారీగా ఎంత ఆక్సిజన్‌ అవసరం అవుతున్నదో దవాఖానలవారీగా లెక్కలు తీసి, ఆ మేరకు సరఫరాను మెరుగుపరిచే కార్యక్రమాన్ని టాస్క్‌ఫోర్స్‌ చేపట్టనున్నదని పత్రిక రాసింది.

రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన కోటా మేరకు ఆక్సిజన్‌ను తెప్పించడంతోపాటు.. రాష్ట్ర అవసరాల కోసం అవసరమైతే కేంద్రంతో మాట్లాడి అదనంగా వచ్చేలా సమన్వయం చేసుకొనే బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌ నిర్వహించనున్నది.

రాష్ట్రంలో అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే వ్యాక్సీన్‌ వేయిస్తుందని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టతనిచ్చారు.

ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రోజువారీగా వచ్చే కోటా ఎక్కువగా ఉండేలా మానిటర్‌ చేయడం, వ్యాక్సీన్‌ తయారీ సంస్థలతో మాట్లాడి నేరుగా తెలంగాణకు కావాల్సిన వ్యాక్సీన్‌ డోసులు వచ్చేలా చేసే బాధ్యతలను టాస్క్‌ఫోర్స్‌ చేపడుతుందని పత్రిక చెప్పింది.

వ్యాక్సీన్‌ కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇప్పటికే గ్లోబల్‌ టెండర్లను పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్‌ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ఈ టాస్క్‌ఫోర్స్‌ మానిటర్‌ చేయనున్నదని నమస్తే తెలంగాణ వివరించింది.

910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి: ప్రధానికి జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్‌కు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇవ్వాలని కేంద్రానికి ఏపీ సీఎం లేఖ రాశారని సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్‌ అవసరమైన రోగులకు సమర్థవంతంగా చికిత్స అందించేందుకు సరిపడేలా 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని కోరారు.

అదే సమయంలో దేశీయ కరోనా వ్యాక్సీన్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం దేశీయ అవసరాలకు సరిపోవడం లేదని.. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవాగ్జిన్‌ టెక్నాలజీని వ్యాక్సీన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలకు బదిలీ చేయడానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

ఇది భారత ప్రభుత్వ ప్రాపర్టీ కనుక పేటెంట్‌ సమస్య ఉత్పన్నం కాదని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానికి వేర్వేరుగా 2 లేఖలు రాశారని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+