ఎయిరిండియా క్రాష్ తో బెదిరిపోయిన పైలట్లు..! ఏకంగా 112 మంది జంప్..!
గత నెల 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏఐ 171 ఐదు నిమిషాల్లోనే కుప్పకూలింది. ఇంజన్ ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు చివరి నిమిషంలో గుర్తించిన పైలట్లు తిరిగి దాన్ని ఆన్ చేసి విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్ పై కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్లు, సిబ్బందితో సహా విమానంలో ప్రయాణిస్తున్న 242 మందితో పాటు పక్కనే ఉన్న హాస్టల్లో ఉన్న మరో 30 మంది విద్యార్ధులూ చనిపోయారు. ఈ ఘటనతో ప్రపంచమే షాకైంది.
ప్రస్తుతం టాటాల చేతిలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన బోయింగ్ విమానం ఇలా కుప్పకూలడం, అందులో పైలట్లతో పాటు 242 మంది ప్రయాణికులు చనిపోవడంతో అంతా నివ్వెరపోయారు. అదే సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఇతర విమానాలు నడుపుతున్న పైలట్లు కూడా బెదిరిపోయారు. ఈ ఘటనతో వారంతా మూకుమ్మడిగా సెలవులు పెట్టి వెళ్లిపోయారు. ఇది ఎయిర్ ఇండియాకు మరో దెబ్బగా మారింది. ఉన్న అరకొర పైలట్లతో ఇతర విమానాలు నడుపుకుంటోంది.

ఈ వివరాల్ని ఇవాళ పార్లమెంట్ లో కేంద్రమే అధికారికంగా వెల్లడించింది. జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా 100 మందికి పైగా పైలట్లు సిక్ లీవ్ తీసుకుని వెళ్లిపోయినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం లీవ్ తీసుకున్న 112 మందిలో 51 మంది కమాండర్లు, మరో 61 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా వెళ్లిపోవడంతో ఎయిర్ ఇండియాకు చెందిన ఇతర విమానాలను నడుపుతున్న పైలట్లు కూడా తడబడినట్లు అర్థమవుతోంది. ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలకు ఇది కూడా కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.

వాస్తవానికి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు విమానయాన సిబ్బందితో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి మానసికంగా కోలుకునేందుకు తగిన సహాయం అందించడానికి పీర్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకోవాలని రెండేళ్ల క్రితమే కేంద్రం ఎయిర్ లైన్ సంస్థలకు సూచించింది. ఆ విషయాన్ని ఇవాళ మరోసారి కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ లోక్ సభలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications