చల్లారని మణిపూర్: మహిళ హత్యతో రాష్ట్ర బంంద్, పెద్ద ఎత్తున నిరసనలు
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 70 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తాజాగా, జరిగిన మహిళ హత్యకేసులో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితుల నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావొంబంగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఓ మహిళను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ హత్యలో ఎవర పాత్ర ఉన్నా తప్పక చర్యలు తీసుకుంటామని ఇంఫాల్ ఈస్ట్ ఎస్పీ స్పష్టం చేశారు.

హత్యకు గురైన మహిళ మారింగ్ నాగా కమ్యూనిటీకి చెందినదని, నిందితుల్లో ముగ్గురిని ఆప్రాంతం నుంచి బహిష్కరించనున్నట్లు హికప్‌మాల్ గ్రామీణాభివృద్ధి కమిటీ తెలిపింది. కాగా, మహిళ హత్యకు వ్యతిరేకంగా నాగా అత్యున్నత కమిటీ యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్‌సి) సోమవారం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నాగాలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ 12 గంటలపాటు కొనసాగింది. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. హత్యపై న్యాయ విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలని యుఎన్‌సీ డిమాండ్ చేసింది. మే 3 నుంచి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు కూడా భారీగా మోహరించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి.












Click it and Unblock the Notifications