ఆ ఒక్క జిల్లాలోనే 13,500 మంది మహిళలకు కేన్సర్ లక్షణాలు..
కేన్సర్ మహమ్మారి చాప కింద నీరులా సైలెంట్ గా విస్తరిస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో ఏడాదిలోనే 200 మంది కేన్సర్ బారినపడ్డారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఒక్క జిల్లాలోనే వేలాది మంది మహిళల్లో కేన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తంగా 3.5 లక్షల మంది మహిళలపై సర్వే చేపట్టగా.. 13,500 మందిలో కేన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించారు. ఇప్పుడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'సంజీవని అభియాన్' పేరిట సర్వే నిర్వహించింది. అందులో భాగంగానే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. హింగొలీ జిల్లాలో ఆరోగ్య సర్వే నిర్వహించారు. మొత్తంగా 3.5 లక్షల మంది మహిళలపై సర్వే చేపట్టగా.. 13,500 మందిలో కేన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించారు. వారిలో 7 వేల మందిలో సర్వైకల్, 3,500 మందిలో బ్రెస్ట్ కేన్సర్, 2 వేల మందిలో నోటి కేన్సర్ అనుమానిత లక్షణాలను గుర్తించినట్లు హింగోలి జిల్లా కలెక్టర్ అభినవ్ గోయల్ వెల్లడించారు.

అంతే కాకుండా మరికొందరిలో ఇతర కేన్సర్ లక్షణాలు కనిపించాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్క్రీనింగ్ ముగిసిందని, తదుపరి పరీక్షలు త్వరలోనే నిర్వహిస్తామని వివరించారు. ఆరోగ్య నిపుణులు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ అభినవ్ గోయల్ తెలిపారు. ఇక మరోవైపు దేశంలో అత్యధికంగా కేన్సర్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, బీహార్, తమిళనాడు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఎవరికి ఏ కేన్సర్ ఎక్కువగా వస్తుందంటే..?
నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రాం నివేదిక ప్రకారం.. భారతదేశంలో పురుషుల్లో నోటి కేన్సర్, మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ అత్యధిక శాతం మందిని వేధిస్తోందని వెల్లడైంది. ఈ ఏడాదిలో 53,565 మందికి కేన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వారిలో 24,857 మంది పురుషులు.. 28,708 మంది మహిళలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అంతే కాకుండా కేన్సర్ బాధితుల్లో పొగాకు వాడకం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేన్సర్ సోకిన వారిలో 42 శాతం మంది పురుషులు ఉన్నారు. వారిలో నోటి కేన్సర్ సోకిన వారు 31 శాతం మంది.. నాలుకకు సోకిన వారు 19 శాతం మంది.. ఊపిరి తిత్తులకు సోకిన వారు 26 శాతం మంది ఉన్నట్టు తెలుస్తోంది. అలానే మహిళల్లో కూడా 13.5 శాతం మందికి పొగాకు పీల్చడం వల్లే కేన్సర్ వచ్చిందని నిర్ధారించారు. అందులో 30 శాతం మందికి ఊపిరితిత్తులకు .. 22 శాతం మందికి నోటికి.. 17 శాతం మందికి నాలుకకు కేన్సర్ సోకినట్టు స్పష్టం చేశారు.
ఇక కేన్సర్ ని నయం చేయడానికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు సైతం ప్రస్తుతం అందిస్తున్నారు. డిఎన్ఏ పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు, బయాప్సీలతో కేన్సర్లను గుర్తించవచ్చు.
ఏపీలోని బలభద్రపురం స్టోరీ..
ఇక బలభద్రపురం గ్రామంలో కేన్సర్ కలకలం సృష్టిస్తోంది. ఏడాది కాలంలోనే ఏకంగా 200 మందికి పైగా ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకోగా.. 30 ప్రాణాలు విడిచారు. బీజేపీ నేత, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి.. శాసనసభలో ఈ అంశం ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. బలభద్రపురంలో కేన్సర్ వ్యాధి విజృంభిస్తుందని.. పరీక్షలు నిర్వహించి, బాధితులకు చికిత్స అందజేయాలని కోరారు. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం తక్కువ లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది.కేన్సర్ వ్యాప్తికి కారణం..
మరోవైపు ప్రాథమిక పరిశోధనలు భూగర్భజల కాలుష్యం, వాయు కాలుష్యం కారణం గానే క్యాన్సర్ కేసుల పెరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బలభద్రపురం దగ్గరలో ఉన్న గ్రాసిమ్ ఫ్యాక్టరీ
నుండి వచ్చే కాలుష్య కారకాలు నీటి నాణ్య, గాలి స్వచ్ఛతను ప్రభావితం చేస్తున్నాయనే ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలోని 25 ప్రదేశాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపినట్టు అధికారులు చెబుతున్నారు. రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.
అయితే బలభద్రపురంలో పర్యావరణ కాలుష్యం కారణంగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగాయని.. ఈ సమస్యపై సమగ్ర విచారణ జరిపించాలని 'ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం' ప్రతినిధులు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్యకు లేఖ రాశారు. గ్రామంలో క్యాన్సర్ తీవ్రతను గుర్తించేందుకు నిపుణుల బృందాన్ని పంపాలని.. పరిశీలన నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో నమోదయ్యే సాధారణ కేసుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా గ్రామంలో కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్‌లు ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని వాపోయారు.












Click it and Unblock the Notifications