విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1971 భారత్, పాకిస్తాన్ యుద్ధం - ఘాజీ: విశాఖపట్నంలో ఆనాటి యుద్ధ వాతావరణం ఎలా ఉందంటే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విక్టరీ ఎట్ సీ

“విశాఖ నగరంలో 51 ఏళ్ల క్రితం ఓ రెండు వారాలు చీకటి పడిన తర్వాత ఒక చిన్న దీపం కూడా వెలగలేదు. అంతా కటిక చీకటే. కనీసం కొవ్వొత్తి వెలిగించుకునే వీలుకూడా లేదు. ఏ క్షణం ఏమవుతుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికాం. విశాఖ టౌన్‌లో ఉన్న 4 లక్షల మంది జనాభా పరిస్థితి అదే” అంటూ 1971 ఇండియా-పాక్ యుద్ధ సమయంలో విశాఖలోని పరిస్థితిని వివరించారు సీనియర్ సిటిజన్ శాంతారామ్. 1971 డిసెంబర్ 4 తర్వాత తమకు కాస్త ధైర్యం వచ్చిందని ఆయన అన్నారు.

నాటి భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగింది. కానీ డిసెంబర్ 4వ తేదీన పాకిస్తాన్ నౌకదళంపై భారత నేవీ చేసిన దాడులతో వారి స్థావరాలకు, సైన్యానికి తీవ్రమైన నష్టం జరిగింది. దాంతో ఆ రోజే భారత నౌకదళం నేవీ డేగా నిర్వహిస్తోంది.

పాకిస్తాన్ నేవీపై దాడులు చేసినది తూర్పు నౌకాదళం కావడంతో ఏటా విశాఖలో ఆ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పాకిస్తాన్‌పై విజయానికి గుర్తుగా 'విక్టరీ ఎట్ సీ’ పేరుతో విశాఖ తీరంలో ఒక మెమోరియల్ కూడా నిర్మించారు.

విశాఖ తీరంలో డిసెంబర్ 4న విజయోత్సవాలు జరుపుకోవడానికి, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధానికి సంబంధం ఏంటి? ఏటా నేవీ డే రోజున విశాఖలో ఏం జరుగుతుంది?

విశాఖపట్నం

''అసలేమీ అర్థం కాలేదు’’

టి. శాంతారామ్ 1971లో విశాఖ ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండేవారు. 1971 యుద్ధ సమయంలో విశాఖపట్నంలో నేవీ కార్యక్రమాలు జరిగే కోస్టల్ బ్యాటరీకి సమీపంలోనే ఉండేవారు. యుద్ధ సమయంలో ఎలా ఉందనేదానికి, అప్పుడు విశాఖలో ఏం జరిగిందనే దానికి ఆయన ప్రత్యక్ష సాక్షి.

“మాకు ఒకటి, రెండు రోజులు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత యుద్ధం జరుగుతుందని వార్తలు వచ్చాయి. 1971 డిసెంబర్ 1 నుంచి రెండు వారాల పాటు చీకటిలో కూడా విశాఖలో ఒక్క లైట్ కూడా వెలిగేదికాదు. ఏదైనా అవసరం వచ్చి కొవ్వొత్తి వెలిగించుకున్నా, సైనికులు వచ్చి ఆర్పేయమని హెచ్చరించేవారు. ఎందుకని అడిగితే ఏ చిన్న వెలుగు కనిపించినా, ఇక్కడ సంచారం ఉందనే విషయం శత్రవులకు తెలుస్తుందని చెప్పేవారు. కాల్ టెక్స్ (ఇప్పటి హెచ్‌పీసీఎల్), పోర్టులను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ సైనికులు విశాఖ వస్తున్నారని చెప్పారు” అని శాంతారామ్ బీబీసీకి వివరించారు.

విక్టరీ ఎట్ సీ

“కాల్‌టెక్స్ పేలితే విశాఖ మిగలదు. క్షణక్షణం భయంగా ఉండేది. రేపు ఉదయం సూర్యుడిని చూస్తామా అని అనుకునేవాళ్లం. అయితే విశాఖకి రహస్యంగా వచ్చిన పాక్ జలాంతర్గామి (సబ్ మెరీన్) పీఎన్ఎస్ ఘాజీని భారత నేవీ నాశనం చేసిందని, యుద్ధం ముగిసినట్లేనని అంతా చెప్పుకునేవారు. ఆ సంఘటన 1971 డిసెంబర్ 4న జరిగింది. అయినా మరికొన్ని రోజులు పాటు విశాఖ టౌన్‌లో యుద్ధ వాతావరణమే కనిపించేది. సాయంత్రం దీపం వెలగనిచ్చేవారు కాదు. దాదాపు రెండు వారాలు విశాఖలోని నాలుగు లక్షల మంది జనాభా చిమ్మచీకట్లోనే గడిపాం” అని శాంతారామ్ చెప్పుకొచ్చారు.

“యుద్దం జరిగిన అన్నీ రోజులు కూడా ఎప్పటికప్పుడు సైరన్ మోతలు, సైన్యం బూట్ల చప్పుళ్లు వినిపించేవి. అవి విన్నప్పుడల్లా ఏదో భయం ఆవరించేది. అయితే విశాఖలో నేలపై యుద్ధం జరగకపోయినా, సముద్రంలో జరిగిన యుద్ధంలో భారత్ గెలవడం ఆనందాన్ని ఇచ్చింది. భారత్ గెలిచిందని రేడియోలో ప్రకటించగానే మా ఇంట్లో, స్నేహితులు అంతా రోడ్లపైకి చేరి కొట్లో మిఠాయిలు కొని పంచుకున్నాం” అని శాంతారామ్ తెలిపారు.

విక్టరీ ఎట్ సీ

డిసెంబర్ 4న ఏం జరిగింది?

పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) నుంచి విమోచన కోరుతూ తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) చేస్తున్న పోరాటాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. 1971 మార్చిలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్ పోరాటానికి మద్దతు తెలిపారు.

అది ఇండియా, పాకిస్తాన్ యుద్ధానికి దారి తీసింది. 1971 నవంబర్ రెండో వారంలోనే యుద్ధానికి సిద్ధం కావాలని పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చిందని, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగిన యుద్ధ పరిస్థితులను భారత మాజీ నేవీ ఉద్యోగి జి. ఫణిరాజు బీబీసీకి వివరించారు.

ఫణిరాజు సబ్ మెరైన్లలో 15 ఏళ్లు పనిచేసి, ప్రస్తుతం కుర్సురా సబ్ మెరైన్ క్యూరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

“పశ్చిమ పాకిస్తాన్ నుంచి 1971 నవంబర్ 30న పాకిస్తాన్.. భారత్‌పై దాడి మొదలు పెట్టింది. డిసెంబర్ 3న పాకిస్తాన్ భారత నేవీని, పోర్టులను టార్గెట్ చేసింది. దాంతో రంగంలోకి దిగిన తూర్పు నౌకదళం డిసెంబర్ 3 రాత్రి నుంచి డిసెంబర్ 4 ఉదయం వరకు పాక్ నేవీ వార్ ఎస్టాబ్లిష్‌మెంట్లను సగానికి పైగా నాశనం చేసింది. ఆ వెంటనే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ పోర్టు ఎంటరై పాకిస్తాన్ సైన్యాన్ని క్రమంగా చిత్తు చేశాయి. ఇదంతా డిసెంబర్ 4న జరగడంతో...మనం డిసెంబర్ 4న విజయోత్సవాలు చేసుకుంటాం. పైగా తూర్పు నౌకదళం ఈ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించడంతో విశాఖ తీరంలో నేవీ డే ఏటా జరుపుకుంటాం” అని ఫణిరాజు బీబీసీతో చెప్పారు.

విక్టరీ ఎట్ సీ

ఘాజీ విశాఖకు ఎందుకు వచ్చింది?

యుద్ధం మొదలైన తర్వాత డిసెంబర్ 4న ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్‌గా యుద్ధరంగంలోకి దిగింది. దీనిపై నుంచే భారత ఫైటర్ జెట్స్ కదులుతాయి.

విక్రాంత్ విశాఖ సమీపంలో ఉన్నట్లు పాకిస్తాన్ నేవీకి సమాచారం అందింది. దాంతో విక్రాంత్‌ని నాశనం చేయడం ద్వారా భారత ఫైటర్ ‌జెట్స్‌ని కదలనివ్వకుండా చేయడం, అలాగే విశాఖ పోర్టుపై దాడి చేయడం ద్వారా యుద్ధ నౌకల రాకపోకలను నివారించడంతోపాటు హెచ్‌పీసీఎల్‌ని పేల్చేసేందుకు కుట్ర పన్నిందని తెలిపారు ఫణిరాజు.

“జఫర్ మొహమ్మద్ సారథ్యంలో 10 మంది అధికారులు, 80 మంది వరకు సైనికులతో శ్రీలంక మీదుగా పాక్ సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీనిపై ఐఎన్ఎస్ రాజ్‌పుత్ అటాక్ చేసి, డిస్ట్రాయ్ చేసింది. ధ్వంసమైన పీఎన్‌ఎస్ ఘాజీ శిథిలాలు కొన్ని ఇప్పటికీ సముద్రంలోనే ఉన్నాయి. సముద్రంపై కొన్ని శకలాలు తేలియాడుతున్నాయనే విషయాన్ని స్థానిక మత్స్యకారులు చెప్పడంతో, ఘాజీ రావడం, దానిని భారత నౌకదళం పేల్చేసిందనే విషయాలు బయటకు వచ్చాయి” అని ఆయన తెలిపారు.

“యుద్ధంలో డిసెంబర్ 16న సుమారు 90 వేల మంది పాకిస్తానీ సైనికులను పాకిస్తాన్ లెప్టినెంట్ కల్నల్ నజియా భారత్‌కు అప్పగించడంతో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో మరణించిన భారత సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని వేడుకలా చేసుకుంటూ 1996లో 'విక్టరీ ఎట్ సీ’ పేరుతో ఒక మెమోరియల్‌ను తూర్పు నౌకదళం నిర్మించింది” అని ఫణిరాజు వివరించారు.

ఈ యుద్ధం తర్వాతే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి, బంగ్లాదేశ్‌గా అవతరించింది.

విక్టరీ ఎట్ సీ

'సబ్ మెరైన్ విక్రాంత్ వస్తోంది... సహాయం చెయ్యండి’

2017లో 'ఘాజీ’ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. ఇందులో పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీ కమాండర్ రజాక్ పాత్రలో రాహుల్ సింగ్ నటించారు. ఇండియన్ సబ్ మెరైన్ కమాండర్ గా రానా దగ్గుబాటి నటించారు. సినిమా క్లైమాక్స్‌లో రాహుల్ సింగ్ “వాడు కమాండరా, లిఫ్ట్ ఆపరేటరా, ఈ ఆటలేంటి?” అంటూ కమాండర్ రానా పాత్రని ఉద్దేశించి డైలాగ్ చెప్తారు.

1971 ఇండియా, పాక్ యుద్ధంలో అలాంటి ఆటలే విశాఖలో జరిగాయని ఆ యుద్ధ సమయంలో విశాఖలోనే ఉన్న చరిత్రకారుడు ఎడ్వార్డ్ పాల్ బీబీసీతో చెప్పారు. సినిమా హంగుల కోసం ఘాజీ సినిమాలో కొన్ని కల్పితాలు పెట్టారని ఆయన తెలిపారు.

విక్టరీ ఎట్ సీ

“ఐఎన్ఎస్ విక్రాంత్‌ను టార్గెట్ చేస్తూ ఘాజీ భారత్ జలాల్లోకి వచ్చింది. నిజానికి అది రాలేదు. మన నేవీయే రప్పించింది. ఎలాగంటే దాని కోసం ఒక 'డెకాయ్’ ఆపరేషన్ నిర్వహించింది. అంటే ఐఎన్ఎస్ ఘాజీ విశాఖలో ఉన్నట్లు ఒక ప్రచారాన్ని నేవీయే చేసింది. ఎలాగంటే అప్పటి వైస్ అడ్మిరల్ కృష్ణన్ ఆధ్వర్యంలో 'సబ్ మెరైన్ విక్రాంత్ వస్తోంది. దాని సిబ్బందికి తగిన ఆహారం, ఇతర అవసరాలు అందించేందుకు ప్రజలంతా సహకరించాలి’ అంటూ వీధుల్లో ప్రచారం చేసేవారు. అదంతా పాకిస్తాన్‌ను తప్పుదోవ పట్టించేందుకేనని, ఆ ప్రచారాన్ని నమ్మి ఘాజీ విశాఖ వైపు వచ్చిందని చెప్పుకునేవారు” అని ఎడ్వార్డ్ పాల్ తెలిపారు.

“1971 యుద్ధం విశేషాలను వివరిస్తూ, తర్వాత ఏడాది అంటే 1972 డిసెంబర్ 4న నేవీ ఒక ఎగ్జిబిషన్ నిర్వహించింది. దానికి నేను హాజరయ్యాను. ఘాజీ సబ్ మెరైన్ ముక్కలు, మన సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాల చిత్రాలు, యుద్ధంలో వాడిన కొన్ని ట్యాంకర్లు, ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి ఆ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. అదే తొలి విజయోత్సవంగా రికార్డైంది. ఇప్పుడు తీరంలో ఏటా డిసెంబర్ 4న యుద్ధ విన్యాసాలు ప్రదర్శిస్తూ నేవీ డే నిర్వహిస్తున్నారు.

నేవీ డే రోజు ఏం జరుగుతుంది?

నేవీ డే ఉత్సవాల్లో భారత త్రివిధ దళాలు పాల్గొంటాయి. ఆ రోజు ఉదయాన్నే తూర్పు నౌకాదళ అధికారులు యుద్ధంలో మరణించిన సైనికులకు 'విక్టరీ ఎట్ సీ’ వద్ద నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యుద్ద విన్యాసాలు ప్రదర్శిస్తాయి.

భారత రక్షణ దళాల సామర్థ్యాన్ని ఇతర దేశాలకు ప్రదర్శించడంతోపాటు భారత యువతను రక్షణ రంగం వైపు ఆకర్షితులను చేయడమే ఈ విన్యాసాల లక్ష్యమని తూర్పు నౌకదళం అధికారులు చెప్తారు.

విక్టరీ ఎట్ సీ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ కూడా. విశాఖ బీచ్‌కు వచ్చినవారు 'విక్టరీ ఎట్ సీ’ మెమోరీయల్ వద్ద ఆగి దాని చరిత్రను తెలుసుకుంటారు. ఇది పూర్తిగా నేవీ నిర్వహిస్తుంది. దీనిని బయట నుంచే చూడటమే కానీ, లోపలకి వెళ్లి చూసేందుకు అనుమతించరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
1971 India-Pakistan War - Ghazi: What was the war atmosphere like in Visakhapatnam that day...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X