సోషల్ మీడియాలో 1000ను 1k అని ఎందుకు రాస్తారు? దీనివెనక కారణం ఏంటి?
1,000' ని సూచించడానికి '1K' అని ఎందుకు రాస్తారో 99 శాతం మందికి తెలియదు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 1K, 10K, 100K అని చూసినప్పుడు మనందరికీ ఒకే సందేహం వస్తుంది.. ఆంగ్లంలో వెయ్యిని 'Thousand' అంటారు కదా, మరి 'T'కి బదులుగా 'K' ఎందుకు ఉపయోగిస్తారు? దీని వెనుక 'Thousand' అనే పదం లేదు, వేల సంవత్సరాల గ్రీకు చరిత్ర, శాస్త్రీయ మెట్రిక్ విధానం దాగి ఉన్నాయి. సోషల్ మీడియాలో 1,000 లైకులు వస్తే '1K' అని, 10,000 వస్తే '10K' అని చూస్తూనే ఉంటాం.
ఆసక్తికరమైన చరిత్ర ఉంది
దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ప్రాచీన గ్రీకు భాషలో వెయ్యిని 'ఖిలియోయి' అనేవారు. ఆ పదమే కాలక్రమేణా మార్పులు చెంది 'కిలో' గా మారింది. మనం నిత్యం వాడే 1 కిలోమీటరు అంటే 1,000 మీటర్లు, 1 కిలోగ్రాము అంటే 1,000 గ్రాములు అని మనకి తెలుసు. అంటే ఇక్కడ 'కిలో' అంటేనే 'వెయ్యి' అని అర్థం. సాంకేతికంగా 'k' చిన్న అక్షరం అనేది 1,000 కి సూచిక కాగా, 'K' పెద్ద అక్షరం అనేది ఉష్ణోగ్రత కొలమానమైన 'కెల్విన్' ని సూచిస్తుంది. 1795లో ఫ్రాన్స్ దేశం మెట్రిక్ విధానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టినప్పుడు, కొలతలను ప్రపంచమంతటికీ సులభంగా అర్థమయ్యేలా చేయడానికి గ్రీకు, లాటిన్ పదాలను ఎంచుకున్నారు. అలా 'కిలో' కొలతల రంగంలోకి వచ్చి, తదనంతరం సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపార రంగాలకు విస్తరించింది. బ్యాంకులు, స్టాక్ మార్కెట్లలో చోటు ఆదా చేయడం కోసం $1,000 కి బదులు short form లో '$1K' అని రాయడం మొదలుపెట్టారు.

స్థలం ఆదా చేయడానికి
మొబైల్ స్క్రీన్లు వచ్చిన తర్వాత తక్కువ స్థలంలో స్పష్టంగా కనిపించడం కోసం సోషల్ మీడియా కంపెనీలు కూడా ఈ పద్ధతినే ఎంచుకున్నాయి. అలా 10,000 అని పెద్దగా రాయకుండా '10K' అని రాయడం అలవాటైంది. ఇదే పద్ధతిలో మిలియన్‌కు 'M', బిలియన్కు 'B' వాడటం మొదలైంది.












Click it and Unblock the Notifications
