ఆంధ్రా స్టైల్ స్పైసీ జ్యూసీ చికెన్ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
చికెన్‌తో ఎన్నో రకాల గ్రేవీ కూరలు వండినప్పటికీ, ఘాటైన నాటు మసాలా కోటింగ్‌తో కరకరలాడుతూ, ఎర్రగా వేయించిన ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై (కోడి వేపుడు) రుచే వేరు. చాలామందికి ఫ్రై చేసేటప్పుడు చికెన్ ముక్క గట్టిపడిపోవడం లేదా మసాలా మాడిపోయి చేదు రావడం జరుగుతుంటుంది. కానీ కొన్ని చిన్న మెళకువలు పాటిస్తే, ముక్క బయట కరకరలాడుతూ లోపల జ్యూసీగా, నోట్లో కరిగిపోయేలా తయారుచేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
చికెన్: అర కేజీ (శుభ్రం చేసినది)
ఉల్లిపాయలు: 2 (సన్నగా పొడవుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3 నుండి 4 (చీలినవి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1½ టేబుల్ స్పూన్ (తాజాది)
కారం, పసుపు, ఉప్పు: రుచికి సరిపడా
నూనె: మ్యారినేషన్ మరియు ఫ్రై కోసం తగినంత
కరివేపాకు, కొత్తిమీర: గుప్పెడు
తాజా హోమ్‌మేడ్ మసాలా:
ధనియాలు 1½ టేబుల్ స్పూన్,
జీలకర్ర 1 టీస్పూన్,
మిరియాలు 1 టీస్పూన్,
లవంగాలు 5,
యాలకులు 3,
దాల్చినచెక్క చిన్న ముక్క

తయారీ విధానం
శుభ్రం చేసిన చికెన్ ముక్కల్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం మరియు ఒక చెంచా నూనె వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు నాననివ్వాలి. సమయం ఉంటే ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి సన్నని మంటపై దోరగా వేయించి చల్లారిన తర్వాత మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై కడాయిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి 3-4 నిమిషాలు పెద్ద మంటపై వేయించాలి. ఆపై మూతపెట్టి చిన్న మంటపై చికెన్ నుంచి వచ్చే నీటితోనే ముక్క 80% వరకు మెత్తగా ఉడికేలా చూడాలి.
చికెన్‌లోని నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలాక మూత తీసి, సిద్ధం చేసుకున్న హోమ్‌మేడ్ మసాలా పొడి, తాజా కరివేపాకు వేసి మీడియం మంటపై 5-7 నిమిషాలు ఎర్రటి రోస్ట్ కలర్ వచ్చే వరకు ఓపెన్‌గా వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ.
ఫ్రై చివర్లో కొన్ని చుక్కల తాజా నిమ్మరసం పిండితే మసాలా ఘాటుకు చక్కటి పులుపు తోడై రుచి రెట్టింపు అవుతుంది.ఫ్రై కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించిన విత్-బోన్ చికెన్ వాడితే జ్యూసీగా ఉంటుంది. ఈ స్పైసీ చికెన్ ఫ్రైని వేడివేడి పప్పుచారు, ఘాటైన రసం లేదా సాంబార్ సాధంతో నంజుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.













Click it and Unblock the Notifications
