భారత్‌లో కొత్తగా 2.59 లక్షల కోవిడ్ కేసులు-4209 మరణాలు.. మందగించిన వ్యాక్సినేషన్, తగ్గిన పాజిటివిటీ రేటు..
భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2.59 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 4209 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.6 కోట్లకు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 2,91,331కి చేరింది. వరుసగా నాలుగు రోజుల పాటు 3 లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదవగా... తాజాగా ఆ సంఖ్య స్వల్పంగా తగ్గడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికం
కొత్తగా నమోదైన కేసుల్లో కేవలం ఐదు రాష్ట్రాల్లోనే 1లక్ష పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తమిళనాడులో 35,579 కేసులు నమోదయ్యాయి. కేరళలో 30,491 కేసులు,మహారాష్ట్రలో 29,911 కేసులు,కర్ణాటకలో 28,869 కేసులు,ఆంధ్రప్రదేశ్‌లో 22,610 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో నమోదైన కేసులు 56.81శాతం కావడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 984 మంది పేషెంట్లు మృతి చెందారు. కర్ణాటకలో 548,ఢిల్లీలో 233 మంది మృతి చెందారు.

ఒక్కరోజులో అత్యధిక టెస్టులు...
గడిచిన 24 గంటల్లో 20.61లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకూ ఒక్కరోజులో నిర్వహించిన టెస్టుల్లో ఇదే అత్యధికం. ఇక దేశవ్యాప్తంగా గత 7 రోజులుగావ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందగించడం ఆందోళన కలిగించే అంశం. గురువారం(మే 20) కేవలం 11.66 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

తగ్గుతున్న పాజిటివిటీ రేటు...
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 12.58శాతానికి తగ్గగా... ఢిల్లీలో 5శాతానికి,ముంబైలో 4.84శాతానికి పడిపోయింది. ముంబైలో గడిచిన 24 గంటల్లో కొత్తగా కేవలం 1425 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గడిచిన రెండు నెలల్లో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. బెంగళూరులోనూ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 9409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చెన్నైలో పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గింది. కొత్తగా 6073 కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 35,579 కేసులు నమోదవగా రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2శాతం మేర పెరగడం గమనార్హం.

వారణాసిలో పరిస్థితులపై మోదీ రివ్యూ...
ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం(మే 21) తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో కోవిడ్ పరిస్ఠితులపై సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక వైద్యులు,పారామెడికల్ స్టాఫ్,వైద్యారోగ్య వాఖ అధికారులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. సెకండ్ వేవ్ కట్టడికి అవసరమైన చర్యల గురించి వారితో చర్చించనున్నారు. గురువారం(మే 20) 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు,జిల్లా మెజిస్ట్రేట్లతో ప్రధాని కరోనాపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications