2023లో గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతి.. ఇంకా చిక్కని నిందితులు !!
మణిపూర్‌లో జరిగిన జాతి హింస వెనుక దాగి ఉన్న ఒక మౌన వేదన కథ ఇప్పుడు దేశాన్ని కలచివేస్తోంది. అది సంఖ్యలు, కేసు నంబర్లు, దర్యాప్తు నివేదికల కథ కాదు... తల్లిదండ్రులు కోల్పోయిన కూతురి కథ. ఒక యువతి జీవితం సామాన్య పరిస్థితుల నుంచి విషాద గాథగా ముగింపు పలికిన సందర్భం ఇది. 2023 అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన ఓ కుకీ-జో యువతి ప్రాణాలు విడిచింది.
దారుణ ఘటనకు ముందు ఆమె ఒక సాధారణ యువతి.
కలలు కనేది, నవ్వేది, కుటుంబంతో సరదాగా గడిపేది. భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న ఆ అమ్మాయి జీవితం ఒక్క రోజులోనే పూర్తిగా మారిపోయింది. మే 15న ఇంఫాల్‌లోని న్యూ చెకోన్ ప్రాంతంలో అల్లరి మూకలు 18 ఏళ్ల కుకీ యువతిని కిడ్నాప్ చేశాయి. మెయిరా పైబీస్ అనే మహిళా సంఘం సభ్యులు ఆమెను పట్టుకుని ఆరంబై టెంగోల్ మిలీషియాకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెపై పలుచోట్ల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో ఉన్న ఆమెను ఓ ఆటోడ్రైవర్ రక్షించి ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడారు కానీ... ఆమె లోపల ఏదో పూర్తిగా విరిగిపోయింది. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఆమె మునుపటి అమ్మాయి కాదు. నవ్వు మాయమైంది, మాటలు తగ్గిపోయాయి, చూపులో భయం నిలిచిపోయింది. కాలం గడిచినా ఆ గాయాలు మానలేదు. వైద్య చికిత్సలు, మందులు, కుటుంబం ఇచ్చిన ధైర్యం... ఏదీ ఆమెను పూర్తిగా కోలుకునేలా చేయలేకపోయింది. చివరికి జనవరి 8న ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రెండు రోజుల్లోనే పరిస్థితి విషమించి, జనవరి 10న ఆమె కన్నుమూసింది. న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఆమె జీవితం ముగిసిపోయింది.
ఈ కేసులో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సీబీఐకి అప్పగించారు. కానీ దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క నిందితుడినీ అరెస్ట్ చేయలేదు. బాధిత కుటుంబానికి న్యాయం దక్కలేదు. ఆమె చావు కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. దీంతో ఈ ఘటనలో పోలీసుల తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం ఒక కేసు కాదని.. ఇది ఒక యువతి కోల్పోయిన భవిష్యత్తు కథ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ఆడబిడ్డ తల్లిదండ్రుల గుండె చీల్చే మౌన రోదన అని.. న్యాయం ఆలస్యం అయితే, అది మరో అన్యాయంగా మారుతుందన్న కఠిన సత్యం అంటూ పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications