మహిళ కిడ్నాప్: హైవే సమీపంలో గ్యాంగ్ రేప్
బెంగళూరు: బెంగళూరు నగరానికి బయలుదేరి బస్సు కోసం వేచి ఉన్న మహిళను కిడ్నాప్ చేసిన నిందితులు హై వే సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లి ఒక్క రోజు గ్యాంగ్ రేప్ చేసిన దారుణ సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగింది.
తీవ్రంగా రక్తం పోవడంతో ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని గురువారం పోలీసులు చెప్పారు. తుమకూరు జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తుమకూరు పట్టణంలో 28 సంవత్సరాల మహిళ నివాసం ఉంటున్నది.
మంగళవారం ఆమె బెంగళూరు రావడానికి సిద్దమైంది. తుమకూరు లోని టౌన్ హాల్ దగ్గర బస్సు కోసం వేచి ఉంది. అదే సమయంలో టాటా సుమో వాహనంలో వెళ్లిన ఐదు మంది ఆమెను కిడ్నాప్ చేశారు. తరువాత ఆమెను నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లారు.

అందరూ కలిసి సామూహిక అత్యాచారం చేసి ఆమెను బుధవారం బెంగళూరు- తుమకూరు జాతీయ రహదారిలోని పాత నిజగల్ ప్రాంతంలో వదిలి పరారైనారు. రక్తం ఎక్కువ పోవడంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
డాబస్ పేటలో చికిత్స అందించిన తరువాత ఆమెను తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు బెంగళూరులోని దాసరహళ్ళిలోని గార్మెంట్స్ ఫ్యాక్టరిలో ఉద్యోగం చేస్తున్నదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి ఆసుపత్రి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఐసీయులో చికిత్స పోందుతున్నదని, తుమకూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారని, ఐదు ప్రత్యేక బృందాలతో కామాంధుల కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications