బెంగళూరుకు తగ్గిన ప్రయాణ సమయం- పట్టాలెక్కిన వందే భారత్
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 147 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ఈ క్రమంలో మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరులో కొద్దిసేపటి కిందటే ఈ మూడు రైళ్లను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్ లో ఈ మూడింటికీ పచ్చజెండా ఊపారు. వీటితో దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య 150కి చేరుకున్నట్టయింది.
బెంగళూరు- బెళగావి, అజ్ని (నాగ్ పూర్)- పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా మార్గాల్లో కొత్తగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నేటి నుంచి పట్టాలెక్కాయి. అదే సమయంలో బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ మార్గాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం రాగిగుడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించనున్నారు.
ప్రతి రోజు తెల్లవారు జామున ఈ ఎక్స్ ప్రెస్.. బెళగావి నుంచి 5:20 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి బెంగళూరు నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి రాత్రి 10:40 గంటలకు బెళగావికి చేరుకుంటుంది. ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు స్టేషన్లల్లో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం ఉంది. కర్ణాటకకు కేంద్రం కేటాయించిన 11వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది.
ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ బెంగళూరుకు చేరుకున్నారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, మాజీ మంత్రి అశోక, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజినీష్, ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మోదీ రోడ్ షో నిర్వహించారు. ర్యాలీగా కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications