Justice BV Nagarathna: సుప్రీం ఫస్ట్ విమెన్ చీఫ్ జస్టిస్‌గా ఛాన్స్: మహిళా జడ్జీల సంఖ్య ఇదీ
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా ఎంపికైన తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ హిమ కోహ్లీ వారిలో ఒకరు. కొద్ది సేపటి కిందటే సుప్రీంకోర్టులో నిరాడంబరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారంతా ప్రమాణ స్వీకారం చేశారు.

సీనియర్ అడ్వొకేట్ నరసింహ బార్ కోసం..
బార్ కోసం సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు కొలీజియం రికమెండ్ చేసింది. ఈ తొమ్మిది మందిలో జస్టిస్ బీవీ నాగరత్నతో పాటు జస్టిస్ విక్రమ్ నాథ్, సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉండే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను ఆమోదించడతో సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ నేరుగా సుప్రీంకోర్టు బార్‌కు నామినేట్ అయిన తొమ్మిదో న్యాయవాది అయ్యారు.

నాలుగుకు చేరిన మహిళా న్యాయమూర్తుల సంఖ్య
ఇవ్వాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. జస్టిస్ హిమ కోహ్లీ తరువాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ బేలా ఎం త్రివేది కొత్తగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఎలివేట్ అయ్యారు. దీనితో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల ప్రాధాన్యత పెరిగినట్టయింది. వారి సంఖ్య నాలుగుకు చేరింది. కొత్తగా నామినేట్ అయిన ఈ తొమ్మిదిమందితో సుప్రీం న్యాయమూర్తల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 33కు చేరింది.

జస్టిస్ బీవీ నాగరత్నకు ఛాన్స్..
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జస్టిస్ బీవీ నాగరత్న సీనియర్. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ వెంకట్రామయ్య కుమార్తె ఆమె. కర్ణాటక హైకోర్టు నుంచి ఆమె సుప్రీంకోర్టుకు ఎలివేట్ అయ్యారు. 2027 వరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారు. అత్యంత సీనియర్ కావడం వల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే- దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో 36 రోజుల పాటు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది.

తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ హిమ కోహ్లీ..
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ప్రమాణం చేశారు. ఆమె మాతృ న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టు. 2006లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడ కొనసాగుతోన్న సమయంలోనే పదోన్నతి పొందారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా- సుప్రీంకోర్టుకు నామినేట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆమె పదవిలో కొనసాగుతారు.
Recommended Video

గుజరాత్ నుంచి సుప్రీంకోర్టుకు..
అనంతరం జస్టిస్ బేలా ఎం త్రివేది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 జూన్ 10వ తేదీన ఆమె పదవీ విరమణ చేస్తారు. జ్యుడీషియల్ బ్యాక్‌గ్రౌండ్ సర్వీస్ నుంచి సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన ఏకైక మహిళా న్యాయమూర్తి ఆమె. అలాగే- గుజరాత్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి కూడా ఆమెనే. 2003 నుంచి 2006లో గుజరాత్ ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శిగా పని చేశారు.












Click it and Unblock the Notifications