జాబ్ అర్హత 5వ క్లాస్.. కానీ వచ్చిందేమో ఇంజనీర్లు, MBAలు! (వీడియో)
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో నిరుద్యోగిత తీవ్రతకు అద్దం పడుతున్న ఓ వింత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోంగార్డుల నియామక పరీక్ష కోసం వేలాది మంది అభ్యర్థులు ఏకంగా విమానాశ్రయం రన్‌వేపై కూర్చుని పరీక్ష రాశారు. సంబల్‌పూర్ జిల్లాలోని జమదర్పాలి ఎయిర్‌స్ట్రిప్ ఓ అసాధారణ పరీక్షా కేంద్రంగా మారింది. హోంగార్డు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్థులు ఎటువంటి బెంచీలు లేదా మ్యాట్లు లేకుండా, నేరుగా రన్‌వేపై కూర్చుని పరీక్ష రాశారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.
8,000 మంది.. కేవలం 187 పోస్టులు!
సంబల్‌పూర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 187 హోంగార్డు పోస్టుల కోసం ఏకంగా 8 వేల మందికి పైగా అభ్యర్థులు తరలివచ్చారు. హోంగార్డు పోస్టుకు కనీస అర్హత కేవలం 5వ తరగతి ఉత్తీర్ణత కావడం విశేషం. ఆశ్చర్యకరంగా ఈ పరీక్షకు హాజరైన వారిలో ఇంజనీర్లు, ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్లు, కంప్యూటర్ సైన్స్ చదివిన వారు అధిక సంఖ్యలో అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కొరత ఏ స్థాయిలో ఉందో ఈ విద్యావంతులైన అభ్యర్థులే నిదర్శనం.

పరీక్షా విధానం, భధ్రత
అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులను ఉదయం 6 గంటలకే రిపోర్ట్ చేయాలని కోరారు. 9 గంటల నుండి ప్రవేశం కల్పించి, 10:30 గంటలకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారు. 20 మార్కులకు 30 నిమిషాల పారాగ్రాఫ్ రైటింగ్, ఆ తర్వాత 30 మార్కులకు గంట సేపు జనరల్ నాలెడ్జ్ పరీక్ష నిర్వహించారు. క్రమశిక్షణను పర్యవేక్షించడానికి డ్రోన్‌లను ఉపయోగించారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 24 మంది ఇన్‌స్పెక్టర్లు, 86 మంది ఎస్‌ఐలు, వందలాది మంది హోంగార్డులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడ్స్ రోడ్లపై లేదా పాఠశాలల్లో కాకుండా, ఏకంగా విమానాశ్రయంలో ఇలా పరీక్ష నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
In Odisha, Airstrip doubles up as examination hall as more than 8000 aspirants turn up for more than 187 homeguard vaccancies. pic.twitter.com/1XH78meDcN
— Piyush Rai (@Benarasiyaa) December 19, 2025












Click it and Unblock the Notifications