పక్కా ప్రణాళికతోనే!: పార్లమెంట్ దాడి ఘటనలో ఐదుగురి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ బుధవారం లోక్‌సభ (Lok Sabha)లోకి దూసుకొచ్చిన ఘటనలో మొత్తం ఆరుగురి పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. మొదట నలుగురు నిందితులే అనుకున్నప్పటికీ తాజాగా మరో ఇద్దరి పాత్ర కూడా ఉందని తేలింది. కాగా, ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
దుండగులు పక్కా ప్రణాళిక, పరస్పర సమయంతోనే ఈ దాడి తరహా ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉందని, కొద్ది రోజుల క్రితం రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులు వర్గాలు తెలిపాయి. ఆరు నెలల క్రితమే ఈ దుశ్చర్యక ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి.

పార్లమెంటు(Parliament) సమావేశాలు జరుగుతున్న లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి ఎంపీలను భయాందోళనకు గురిచేసిన నిందితులు సాగర్ శర్మ, మనో రంజన్ లను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమోల్ శిండే, నీలంను పార్లమెంట్ భవనం వెలుపల అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఇద్దరు నిందితులతోపాటు లలిత్, విక్రమ్ అనే మరో ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో విక్రమ్ ను గురుగ్రాంలో అదుపులోకి తీసుకోగా.. లలిత్ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. కాగా, పార్లమెంటుకు వచ్చే ముందు ఈ ఐదుగురూ గురుగ్రాంలోని విక్రమ్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ప్రణాళిక ప్రకారం ఆరుగురూ పార్లమెంటు లోపలికి వెళ్లాలనుకున్నప్పటికీ.. ఇద్దరికే విజిటర్ పాస్ లభించడంతో వారిద్దరే లోపలికి వెళ్లారు.
కాగా, నిందితులు లోక్‌సభలోకి వెళ్లేందుకు అవసరమైన పాసులు మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి జారీ కావడంతో ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, నిందితులకు పాస్ లు జారీ చేసిన ఎంపీపై సస్పెన్షన్ వేటు వేయాలంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications