కరోనా డేంజర్ బెల్స్ - భారీగా కేసులు, తాజా హెచ్చరికలు..!!
దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. 223 రోజుల తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరింది. ప్రస్తుతం 40,215 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,04,771 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,016కి ఎగబాకింది.
కరోనా కేసలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 11) రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది కోవిడ్ వైరస్ బారినపడ్డారు. దీంతో గతేడాది ఆగస్టు 20 తర్వాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గత ఆగస్టు 20న ఢిల్లీలో 1,190 కేసులు రికార్డయ్యాయి. మంగళవారం 3772 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో పాజిటివిటీ రేటు 25.98 శాతానికి పెరిగింది. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 20,16,101కి చేరాయి. ఇందులో 26,545 మంది మరణించారు. 2876 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 170 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. మహారాష్ట్రలోని ముంబైలో అధికారులు కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. ముంబైలోని దవాఖానల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.09 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 3.65 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.83 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,24,326) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications