పవర్ ప్యాక్డ్- గగనతలంపై దూసుకొచ్చిన యుద్ధ విమానాలు
Republic Day 2025: దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. కర్తవ్యపథ్‌లో కోలాహలం నెలకొంది. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఎగుర వేశారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కొనసాగుతున్నాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర కేంద్రమంత్రులు, వివిధ శాఖలు, విభాగాల అధికారులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆహ్వానితుల మధ్య కన్నుల పండువగా పరేడ్ సాగుతోంది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాటు పూర్తి చేశారు.
ముఖ్య అతిథి ప్రబావో సుబియాంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయబద్ధమైన గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. ఆ వెంటనే ప్రధాని మోదీ అక్కడికి వచ్చారు. ఆ వెంటనే- రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ వెంటనే 21 గన్ సెల్యూట్‌ను స్వీకరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు.
కర్తవ్యపథ్ వద్ద జాతీయ పతాకావిష్కరణతో పరేడ్ ప్రారంభమైైంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 300 మంది కళాకారుల బృందం ప్రదర్శన ఇచ్చింది. కవాతు కొనసాగుతున్నప్పుడు వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు పూలను చల్లడం హైలైట్‌గా నిలిచింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గగనతలంపై నిర్వహించిన వైమానిక దళం విన్యాసాలు కట్టి పడేశాయి. మన దేశ రక్షణ వ్యవస్థ ఎంత శక్తిమంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పాయి. వివిధ ఆకారాల్లో యుద్ధ విమానాలు ప్రదర్శించిన విన్యాసాలు ఆహ్వానితులను చూపులు తిప్పుకోనివ్వలేదు.
అత్యంత శక్తిమంతమైన రాఫెల్ యుద్ధ విమానాలు సైతం ఇందులో పాల్గొన్నాయి. ప్రత్యేకించి- రాఫెల్ యుద్ధ విమానాలు ప్రదర్శించిన వజ్రాంగ్ విన్యాసం అందరినీ ఆకట్టుకుంది. పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్, సుఖోయ్, జాగ్వార్, సీ-17.. వంటివి ఇందులో పాల్గొన్నాయి.












Click it and Unblock the Notifications