ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడ్డ బస్సు: పలువురి దుర్మరణం: పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. జిల్లాలోని థాత్రి నుంచి ఈ ఉదయం 9 గంటలకు దోడా టౌన్‌కు బయలుదేరింది ఈ మినీ బస్సు. ఆ సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొందరు పర్యాటకులు. మార్గమధ్యలో ఈ మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. చీనాబ్ నది మీదుగా వెళ్తోన్న సమయంలో అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. బస్సు లోయలో పడిన సమాచారం అందిన వెంటనే దోడా పోలీసులు, జవాన్లు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. లోయలో పడిన బస్సు నుంచి క్షతగాత్రులను వెలికి తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బయటికి తీసుకొచ్చిన వారిని తీసుకొచ్చినట్టుగానే దోడా జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పట్ల కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఎనిమిది మంది దుర్మరణం పాలైనట్లు ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు.












Click it and Unblock the Notifications