రద్దీగా ఉండే ప్రాంతంలో పేలిపోయిన బాణాసంచ గౌడన్, 8 మంది బలి, సీఎం సీరియస్ !
చెన్నై/క్రిష్ణగిరి: తమిళనాడులో మరోసారి టపాకాయలు (బాణాసంచా) గౌడన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తమిళనాడులోని క్రిష్ణగిరి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో బాణాసంచా గౌడన్ పేలిపోవడంతో 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం మద్యాహ్నం క్రిష్ణగిరిలోని పాతపేటలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో బాణాసంచా గౌడన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
నిమిషాల వ్యవదిలోనే బాణాసంచా గౌడన్ లో భారీ మంటలు వ్యాపించడంతో గౌడన్ పేలిపోయింది. అటువైపు సంచరిస్తున్న ప్రజలు ప్రాణభయంతో పరుగుతీశారు. బాణాసంచా గౌడన్ పేలుడుతో క్రిష్ణగిరి పట్టణం దద్దరిల్లిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు వాహనాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

బాణాసంచా గౌడన్ పేలిపోవడంతో 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చాలా మందికి గాయాలు కావడంతో వారిని క్రిష్ణగిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి, కొంత మందిని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి పరుగు తీశారు. బాణాసంచా గౌడన్ లో మంటలు వ్యాపించడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని క్రిష్ణగిరి జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం నిర్లక్షం కారణంగానే క్రిష్ణగిరిలో బాణాసంచా గౌడన్ పేలిపోయిందని అన్నాడీఎంకే పార్టీ రెబల్ లీడర్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే. శశికళ నటరాజ్ ఆరోపించారు.

క్రిష్ణగిరి సంఘటనపై సమగ్ర విచారణ చెయ్యాలని, నిర్లక్షంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం ఎంకే. స్టాలిన్ తో పాటు మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ నాయకులు ప్రగాఢసానుభూతి తెలిపారు. అటు వైపు వెలుతున్న వారు సిగరేట్ తాగి గౌడన్ లోకి విసిరేశారా ?, షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు వ్యాపించాయా ? తదితర కోణాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications