ముసలోడే గానీ..: ఏమార్చి..ఏకంగా 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఘనుడు: ఎఫ్ఐఆర్ బుక్
పాట్నా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశంలో జోరుగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 151.58 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు హెల్త్ వర్కర్లు. ఇది మరింత ముమ్మరంగా సాగుతోంది. చాలినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉండటంతో డబుల్ డోసులు విస్తృతంగా అందజేస్తోన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వారికి కూడా టీకాలు వినియోగంలోకి వచ్చాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను పిల్లలకు వేస్తోన్నారు.

రెండో డోసు కోసం నెలల తరబడి..
ఇదంతా ఒక ఎత్తయితే.. ఓ వృద్ధుడు 11 డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం మరో ఎత్తు. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి కనీసం మూడు నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏకంగా 11 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లిన ప్రతీసారీ అతను నకిలీ డాక్యుమెంట్లను హెల్త్ వర్కర్లకు అందజేశాడు. విడతల వారీగా ఇన్ని డోసుల టీకాలను వేయించుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. అతనిపై కేసు నమోదు చేశారు.

బిహార్‌లో
బిహార్‌లో చోటు చేసుకుందీ ఘటన. ఆ వృద్ధుడి పేరు బ్రహ్మదేవ్ మండల్. వయస్సు 84 సంవత్సరాల పైమాటే. మాధేపూర్ జిల్లాలోని పురైనీ అతని స్వగ్రామం. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అతను 11 కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతీసారీ తాను ఆరోగ్యంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కడా లేని ఉత్సాహం కలిగేదని వ్యాఖ్యానించాడు. అందుకే- ఆరోగ్యం బాగోలేదనిపించినప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నానని అంగీకరించాడు.

ఎఫ్ఐఆర్ నమోదు..
బ్రహ్మదేవ్ మండల్ 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలియడంతో పురైనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీకా వేయించుకోవడానికి అతను అందజేసిన ఆధార్, ఇతర డాక్యుమెంట్లను పోలీసులకు అందజేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బ్రహ్మదేవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతన్ని స్టేషన్‌కు పిలిపించి.. విచారించారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు అతను అంగీకరించాడు.

వేర్వేరు తేదీల్లో.. వేర్వేరు హెల్త్ సెంటర్లలో
గత ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన బ్రహ్మదేశ్ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు. మార్చి 13వ తేదీన అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెకెండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. అనంతరం కొత్త హెల్త్ సెంటర్‌ను ఎంచుకున్నాడు. ఔరయ్ ఆరోగ్య కేంద్రంలో మే 19న మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు. జూన్ 16, జులై 24, ఆగస్టు 31, సెప్టెంబర్ 11, అదే నెల 22, 24 తేదీల్లో వేర్వేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టీకా డోసులను వేయించుకున్నాడు. టీకా వేయించుకున్న ప్రతీసారీ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాడినని చెప్పుకొచ్చాడు.

లక్షన్నర దాటిన కొత్త కేసులతో సతమతం..
తాజా బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,59,632 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 327 మంది మరణించారు. 40,863 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువ అయ్యాయి. యాక్టివ్ కేసులు 5,90,611గా రికార్డయ్యాయి. 4,83,790 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 10.27 శాతంగా నమోదైంది. రోజువారీ కొత్త కేసులు లక్షన్నరను దాటేయడం.. యాక్టివ్ కేసులు ఆరు లక్షలకు చేరువ కావడం వంటి పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications