తగ్గని కరోనా తీవ్రత - జాగ్రత్తలు అవసరం..!!
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసుల కొంత తగ్గినా.. మరోసారి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కరోనా సబ్ వేరియంట్ కారణంగా పాజిటివ్ కేసుల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. ప్రధానంగా ఢిల్లీతో పాటుగా మహారాష్ట్ర, కేరళలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది. సబ్ వేరియంట్ తీవ్రత ప్రస్తుతానికి ప్రభావం చూపిస్తున్నా, క్రమేణా తగ్గే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 9,355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ముంద రోజుతో పోలిస్తే 2.8 శాతం తక్కువగా పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,410. ఇక బుధవారం దేశవ్యాప్తంగా 26 కరోనా మరణాలు సంభవించగా, ఒక్క కేరళలోనే ఆరుగురు అసువులు బాసారు. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 5,31,424 కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా వ్యాప్తిని సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. కొవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని వెల్లడించింది.

ఇక దేశంలో ఇప్పటివరకూ 22.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. తాజాగా కేరళలో ఆరుగురు కరోణా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్త వేరియంట్ లక్షణాలు కరోనా కంటే భిన్నంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ ప్రభావం తీవ్ర స్థాయిలో లేకపోయినా కేసుల సంఖ్య పెరగటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేసారు. అదే విధంగా కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు అవసరం అని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కుల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications