నా హెల్మెట్ చోరీ అయ్యింది, వెతికిపెట్టండి, కేసు పెట్టిన మహానుభావుడు !
బెంగళూరు: నా హెల్మెట్ దొంగిలించబడిందని బెంగళూరు పోలీసులకు ఓ యువకుడు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు షాక్ అయ్యారు. శబరి సూర్య అనే వ్యక్తి బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని ద్వారకానగర్‌లోని జయదుర్గా బేకరీలో జ్యూస్ తాగేందుకు వెళ్లిన శబరి సూర్య అతని హెల్మెట్‌ను మర్చిపోయాడు. అనంతరం వెళ్లి చూసే సరికి దుండగులు హెల్మెట్‌ను అపహరించి పరారయ్యారు.
ఈ మేరకు గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫిర్యాదులో నా హెల్మెట్ విలువ రూ. 10 వేల రూపాయలు అని ఫిర్యాదుదారు శబరి సూర్య తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హెల్మెట్ కోసం వేట ప్రారంభించారు. ఫిర్యాదుదారు శబరి సూర్య బెంగళూరులోని పీఈఎస్ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేకరీ, ఆ బేకరి పక్కనే ఉన్న దుకాణాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు గురించి ఫిర్యాదుదారు సూర్య మీడియాతో మాట్లాడుతూ నేను హోసకెరహళ్లిలోని ద్వారకా నగర్‌లోని పీఈఎస్ కళాశాలలో బీబీఏ అండ్ ఎల్‌ఎల్‌బీ నాలుగవ సంవత్సరం చదువుతున్నానని, ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నానని వివరించాడు.
మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో మా కాలేజీ సమీపంలోని ద్వారకా నగర్ రోడ్డులోని జయదుర్గా బేకరీ ఎదురుగా ఉన్న ఓ షాపు టేబుల్‌పై హెల్మెట్‌ను ఉంచి జ్యూస్ తాగేందుకు వెళ్లాను. హెల్మెట్ విలువ సుమారు 10 వేల రూపాయలు, కొందరు దొంగలు తన హెల్మెట్ ను చోరీ చేశారని శబరి సూర్య ఆరోపించాడు.

అయితే నిత్యం పెరిగిపోతున్న జనాబాతో నేరాలు కూడా అంతే ఎక్కువగా పెరిగిపోవడంతో బెంగళూరు పోలీసులు నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో హెల్మెట్ పోయిందని ఓ కాలేజ్ విద్యార్థి కేసు పెట్టడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఎల్ఎల్ బీ పూర్తి చెయ్యకుండా ఇలాంటి కేసు పెట్టిన శబరి సూర్య ఎల్ఎల్ బీ పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తే మంచి లాయర్ అవుతాడని అతని స్నేహితులు అంటున్నారు.












Click it and Unblock the Notifications