కుమార్తెను విదేశాలకు విమానం ఎక్కించారు, దంపతులను మింగేసిన బెంగళూరు-మదనపల్లె రోడ్డు, కారు !
విదేశాలకు వెలుతున్న కూతుర్ని ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసిన దంపతులు కారులో సొంత ఊరికి బయలుదేరి కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు పోయాయి.
మదనపల్లె/బెంగళూరు: దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేశారు.చిన్న కూతురు విదేశాల్లో ఉద్యోగం చేస్తోంది. విదేశాలకు వెలుతున్న కూతుర్ని ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసిన దంపతులు కారులో సొంత ఊరికి బయలుదేరారు. మార్గం మధ్యలో రోడ్డు మరమత్తు పనులు జరుగుతుండటం, రాత్రి భారీ వర్షం కురవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. అంతే వేగంగా పెద్ద మోరీ మీద నుంచి కిందకు కారు పడిపోవడంతో దంపతులకు తీవ్రగాయాలైనాయి. రాత్రి కారును ఎవ్వరూ గమనించకపోవడంతో కొన్ని గంటల తరువాత స్థానికులు చూడటంతో అప్పటికే దంపతుల ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మదనపల్లె సివిల్ ఇంజనీర్
ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె (సత్యసాయి జిల్లా, గతంలో చిత్తూరు జిల్లా)లో షఫీ (55), షమా (50) దంపతులు నివాసం ఉంటున్నారు. షఫీ సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు బ్రిడ్జ్ లు, కాంట్రాక్టు పను చేయించాడు. షఫి, షమా దంపతులకు ముగ్గురు కుమార్తె ఉన్నారు. షఫి, షమా దంపతులు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించారు.

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కూతురు
ఈజిప్టులో ఉద్యోగం చేస్తున్న చిన్నకూతురు షిఫా ఈజిప్టులో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల సెలవులపై ఈజిప్టు నుంచి చిన్న కూతురు షిఫా మదనపల్లెకు వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన కూతురితోతో షఫి, షమా దంపతులు, బంధువులు చాలా సంతోషంగా గడిపారు. కూతురు షిఫా విదేశాలకు వెళ్లడానికి బయలుదేరింది. శుక్రవారం రాత్రి మదనపల్లె నుంచి షఫి, షమా దంపతులు కూతురు షిఫాతో కలిసి దేవనహళ్లిలోని బెంగళూరు అంతర్జాతీమ విమానాశ్రయం దగ్గరకు వెళ్లారు.

విమానం ఎక్కిన కూతురు
అంతర్జాతీయ విమానాశ్రయంలో కూతురు షిఫా విదేశాలకు బయలుదేరింది. తరువాత టయోటా ఇతియోస్ కారులో షఫి, షమా దంపతులు శనివారం వేకువ జామున దేవనహళ్లి నుంచి బెంగళూరు- మదనపల్లె మార్గంలో మదనపల్లెకు బయలుదేరారు. బెంగళూరు-మదనపల్లె మార్గం మధ్యలో రోడ్డు పనులు రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్డు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్లు పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్త బోర్డులు ఏర్పాటు చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి. చింతామణి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా బెంగళూరు-మదనపల్లె రోడ్డు పనులు చేస్తున్నారు.

కారు అదుపు తప్పి ?
మార్గం మధ్యలో చింతామణి దాటిన తరువాత లక్ష్మీపురం క్రాస్ సమీపంలో రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో షఫి, షమా దంపతులు వెలుతున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దిగేసింది. అయితే వర్షం దెబ్బతో రోడ్డు బురదగా ఉండటంతో కారు అదుపుతప్పి పెద్ద మోరీ మీద నుంచి పల్లంలోకి పడిపోయింది. ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కాకముందే కారు మోరీ కిందకు పడిపోవడంతో కింద ఉన్న పెద్ద బండరాయి షఫి, షమా దంపతులకు తగలడంతో తీవ్రగాయాలైనాయి.

ఎవ్వరు గమనించకపోవడంతో ప్రాణాలు
ప్రమాదం జరిగింది వేకువ జామున కావడం, ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో కారు కిందపడిపోయిన విషయం ఎవ్వరూ గమనించలేదు. శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో అటువైపు మూత్రవిసర్జన చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కారు కిందపడిపోయిన విషయం గుర్తించి వెంటనే గౌన్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారు పైకి తీశారు. అయితే అప్పటికే షమా, షఫీ దంపతుల ప్రాణాలు పోవడంతో ఇద్దర శవాలను శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కూతుర్ని వెనక్కి పిలిపించిన ఎయిర్ పోర్టు అధికారులు
కారు నెంబర్, కారులో చిక్కిన పత్రాల ఆధారంలో షఫి, షమా దంపతుల వివరాలు సేకరించిన పోలీసులు మదనపల్లెలోని వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులు ఈజిప్టుకు బయలుదేరిన షఫీ కుమార్తె షిఫాకు సమాచారం ఇచ్చి ఆమెను వెనక్కి పిలిపిస్తున్నారు. కుమార్తెను సంతోషంగా విదేశాలకు పంపించి ఇంటికి వెలుతున్న దంపతుల కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మదనపల్లెలో విషాదచాయలు నెలకొన్నాయి.

కాంట్రాక్టర్ మీద కేసులు
బెంగళూరు-మదనపల్లె రోడ్డు పనులు కొన్ని సంవత్సరాల నుంచి నత్తకనడకన నడుస్తున్నాయని, ముందుస్తుగా రోడ్డుకు ఇరువైప ప్రమాద బోర్డులు కూడా ఏర్పాటు చెయ్యకపోవడంతో ప్రమాదం జరిగిందని షఫీ, షమా దంపతుల బంధువులు కేసు పెట్టడంతో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ మీద కేసులు నమోదు చేశామని గౌనిపల్లె పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications