• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గడ్డి పరికలతో ఆరు గజాల చీర నేసి అబ్బురపరిచిన తెలుగు రైతు

By BBC News తెలుగు
|

గడ్డి పరికలతో చీరను నేచిన రైతు

ఎండుగడ్డి పరకలతో ఏం చేయవచ్చునని ఎవరినైనా అడిగితే.. ఏం చేయగలం..? పశువుల కడుపు నింపడం తప్ప? అనే సమాధానం వస్తుంది. కానీ పశువులకు ఆహారంగా ఉపయోగించే గడ్డినే ఆధారంగా చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచేలా వివిధ వస్తువులను సిద్ధం చేయవచ్చని ఓ రైతు నిరూపించారు.

అనేకమందికి విస్మయం కలిగించే రీతిలో ఆ వస్తువులను ప్రదర్శించి మన్ననలు కూడా పొందారు. కానీ తనకు కనీసం కళాకారుడి పెన్షన్ కూడా ఇవ్వడం లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను స్వయం సాధనతో నేర్చుకున్న ఈ విద్య తర్వాతి తరాలకు చేరకుండా పోతుందేమోననే కలవరపడుతున్నారు.

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం వాసి మొవ్వా కృష్ణమూర్తి గడ్డి పరకలతో చీర నేశారు. గడ్డితో ఇంకా పలు రకాల వస్తువులను కూడా తయారుచేశారు. ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన వయసులో ఈ నైపుణ్యాన్ని నలుగురికీ అందించాలనే ఆశిస్తున్నారు.

పొలం పనుల్లో ఉండి.. పోటీ తత్వంతో..

గ్రామీణ ప్రాంతంలో ఎండుగడ్డిని ఉపయోగించి గట్టి తాళ్లు తయారు చేస్తుంటారు. కానీ గడ్డితో చీర రూపొందించే ఆలోచన, ప్రయత్నం చాలామందిని అబ్బురపరుస్తుంది.

అయితే మొవ్వా కృష్ణమూర్తి మాత్రం చిన్న నాటి నుంచి స్వయంకృషితో వివిధ వస్తువులను తయారు చేయడం అలవరుచుకున్నారు. జనపనార, ఊలు సహా వివిధ వస్తువులతో తాళ్లు అల్లటం నేర్చుకున్నారు. అందులో కొన్నింటినీ నలుగురినీ మెప్పించాలనే రీతిలో పోటీకి కూడా తీసుకెళ్లేవారు. ఆ క్రమంలోనే ఒకసారి పోటీలో తనతో సమానంగా నిలిచిన వ్యక్తిని అధిగమించాలనే ఉద్దేశంతో గడ్డితో చీర చేయాలనే ఆలోచన వచ్చిందని ఆయన చెబుతున్నారు.

''ఒకసారి తెనాలికి చెందిన ఓ వ్యక్తి నేసిన తాళ్లు, నేను నేసిన వాటితో పోటీకి వచ్చాయి. ఎవరివి బాగున్నాయో చెప్పడం కూడా కష్టమయ్యింది. ఆ సమయంలో ఆయన జనపనారతో కండువా తయారుచేశారు. దాంతో ఆయనకే బహుమతి వచ్చింది. అది చూసి ఆయన జనపనారతో చేసినప్పుడు నేను గడ్డితో ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది’’ అని ఆయన బీబీసీకి వివరించారు.

''అప్పుడు గడ్డితో ప్రయత్నం చేశాను. నలబై ఏళ్ల కిందట గడ్డితో చేసిన కండువాకి బహుమతులు వచ్చాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పొదిలిలో పెట్టిన పోటీలో కండువాతో పోటీగా ఇంకా మరికొన్ని చేయాలని సూచనలు చేశారు. కొన్నాళ్లకు కలెక్టర్‌గా వచ్చిన ఉదయలక్ష్మి గారి ప్రోత్సాహంతో కండువా కన్నా పెద్దది చేయాలనే సంకల్పంతో 40 అంగుళాల పొడవు, 20 అంగుళాల వెడల్పుతో జాతీయ జెండా రూపొందించాను. దానిని చూసి వ్యవసాయ శాఖ వారు అవార్డు ఇచ్చారు. ఆ జెండాకే మంచి పేరు రావడంతో దానికన్నా పెద్దది చీర చేయాలని ఆలోచించి అది తయారుచేశాను" అని చెప్పారు కృష్ణమూర్తి.

మొవ్వా కృష్ణమూర్తి

బహుమతులు రావడంతో మరింత ఉత్సాహం

కేవలం ఐదో తరగతి మాత్రమే చదువుకున్న సామాన్య రైతు కుటుంబీకుడు మొవ్వా కృష్ణమూర్తి. పొలం పనులు చేసుకుంటూ, పశువుల పోషణలో గడిపేవారు. ఆ సమయంలోనే పొలాల్లో లభించే వాటితో వివిధ వస్తువులను తయారుచేయడం అలవాటయింది.

అయితే.. గడ్డితో చీర చేయాలనే ప్రయత్నం చాలా కఠిన పరీక్షగానే సాగిందని కృష్ణమూర్తి చెబుతున్నారు. అయినా పట్టుదలతో చీర నేయడం సంతృప్తినిచ్చిందని చెబుతారు.

"కండువా నేసిన తర్వాత చీర ఎందుకు రాదనే అంచనాకు వచ్చాను. చీర తయారు చేశాను. దేశమంతా వివిధ ప్రదర్శనల్లో ఉంచితే, అందరూ అభినందించారు. కానీ వరిగడ్డితో చీర నేసిన తర్వాత దానికి డిజైన్ కావాలంటే రంగులు నిలిచేవి కాదు. కారిపోయేవి. అప్పుడు వేటపాలెంలో చేనేత కార్మికుల సలహాతో మధ్యలో దారం, జరీపోగుతో అంచులు చేశాను. దాంతో దానికి కొత్త అందం వచ్చింది. దానికే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కొన్ని వస్తువులు చేయడం, అన్నింటికీ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది" అని వివరించారు.

మొవ్వా కృష్ణమూర్తి

పెన్షన్ కూడా ఇవ్వడం లేదు..

గ్రామీణ కళాకారుల ప్రతిభను గుర్తించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి తనకు సహకారం లేదని మొవ్వ కృష్ణమూర్తి వాపోతున్నారు. నేత బట్టలంటే పత్తి, ఊలు లాంటి ముడిసరుకునే కాకుండా గడ్డితో కూడా సిద్ధం చేయవచ్చని రుజువు చేసిన తనకు అభినందనలు, అవార్డులు తప్ప ఆర్థికంగా ఆదుకునేందుకు పెన్షన్ ఇవ్వడం లేదని చెబుతున్నారు.

"అగ్గిపెట్టెలో చీర నేసిన నైపుణ్యం మన దేశానికి సొంతం. ఎండుగడ్డి పోచలు ఏరుకుని, వాటిని అనువుగా బ్లేడుతో కట్ చేసుకుని, ఒక్కొక్కటిగా నేయాలి. అలా నేస్తూ నేస్తూ నాకాలు మొద్దుబారిపోయింది. నేను తయారుచేసిన వస్తువులు అందరినీ అలరించాయి. చాలామంది ఎందుకీ పని అంటూ నిరాశపరిచినా నేను వెనక్కి తగ్గకుండా నేసిన చీర అమెరికా వరకూ వెళ్లింది. రాష్ట్రపతులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ మెచ్చుకున్నారు. కానీ నాకు మాత్రం కళాకారుల పెన్షన్ ఇప్పించాలని ఎంత తిరిగినా ఫలితం రాలేదు. ఇప్పటికైనా ఆ పెన్షన్ ఇప్పించాలి’’ అని ఆయన కోరుతున్నారు.

ఇలాంటి కళ మరింత మందికి చేర్చాలని కొందరు ప్రయత్నం చేసి తనతో శిక్షణ ఇప్పించారని కృష్ణమూర్తి తెలిపారు. ''కానీ నేర్చుకునే వాళ్లకు ఓపిక ఉండాలి. అలా ఎవరైనా ముందుకొస్తే తర్వాతి తరాలకు కూడా ఈ విభిన్న వస్తువులు తయారుచేసే అవకాశం ఉంటుంది’’ అని చెబుతున్నారు.

"సామాన్య కుటుంబానికి చెందిన అరుదైన కళాకారుడు కృష్ణమూర్తి వంటి వారికి గుర్తింపుతో పాటుగా ఆదుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం స్పందించాలి. కళాకారుల పెన్షన్ తో పాటు ఇతర అవకాశాలు పరిశీలించాలి. ఈ అరుదైన కళను భావి తరాలకు అందించే ఏర్పాట్లు చేయాలి. కళాతృష్ణతో తాను చేసిన ప్రయత్నం మరుగునపడకుండా కాపాడుకోవాలి" అంటూ వీరన్నపాలెం గ్రామానికే చెందిన పి.రమేష్, ఇతర గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
A dazzling Telugu farmer weaving a six-yard sari with straw tools
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X