ప్రాణం మీదికి తెచ్చుకోవడం ఎందుకు గురూ?
ప్రేమించిన వ్యక్తి కోసం కట్టుకున్న భర్తను కడతేరుస్తున్న ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటుండటంతో అతడు బెంబేలెత్తిపోయాడు. తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న సదరు వ్యక్తి.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే, అప్పటికే ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉండటం గమనార్హం.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంట్‌తో పూడ్చి పెట్టిందో ఓ మహిళ. పెళ్లైన రెండు వారాలకే రెండు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది మరో వివాహిత. మరో వివాహిత భర్తకు విషమిచ్చి చంపింది. ఇలా వరుస ఘటనలకు సంబంధించిన వార్తలు చూసిన సంత్ కబీర్ జిల్లా కటార్ జాట్ గ్రామానికి చెందిన బబ్లూలో ఆందోళన మొదలైంది.

ఎందుకంటే.. బబ్లూకు గోరఖ్ పూర్‌కు చెందిన రాధికతో 2017లో వివాహం జరిగింది. ఇప్పుడు వారికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. వలస కార్మికుడైన బబ్లూ.. పని నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో అతని భార్యకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. బబ్లూకు ఈ విషయం తెలిసింది. ఇటీవల ప్రియుడి కోసం భర్తలను చంపిన ఘటనలను చూసిన బబ్లూ భయాందోళనకు గురయ్యాడు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యతో గొడవపడి తన ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని బబ్లూ భావించాడు. ఈ నేపథ్యంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం చేయాలని నిర్ణయించాడు. ఇందుకు వారిద్దరూ అంగీకరించడంతో వారికి పెళ్లి చేశాడు. వారి వివాహాన్ని కోర్టులో నోటిఫై చేశాడు. అంతేగాక, అఫిడవిట్ లో తానే సాక్షిగా సంతకం చేశాడు. ఇక, తన ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే స్వీకరించాడు.












Click it and Unblock the Notifications