• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతికి బహుమానంగా జింబాబ్వే ఇచ్చిన ఏనుగును తిరిగి పంపించేయమంటూ కోర్టులో పిటిషన్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇరవై నాలుగేళ్ల కిందట శంకర్ అనే పేరున్న పిల్ల ఏనుగును ఆఫ్రికా నుంచి విమానంలో భారత రాజధాని దిల్లీలోని ఒక 'జూ'కు తరలించారు. ఇప్పుడు ఆ ఏనుగును తిరిగి ఆఫ్రికాకు పంపించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

16 ఏళ్ల నిఖితా ధావన్ హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆఫ్రికా జాతికి చెందిన ఈ మగ ఏనుగు ఏళ్ల తరబడి ఇక్కడి జూలో ఒంటరిగా నివసిస్తోందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. 'యూత్ ఫర్ యానిమల్స్' అనే స్వచ్ఛంద సంస్థను నిఖితా ధవన్ స్థాపించారు.

'శంకర్'ను దిల్లీలోని జంతు ప్రదర్శనశాల నుంచి తప్పించి, మిగతా ఆఫ్రికా ఏనుగులు నివసించే వన్యప్రాణి అభయారణ్యానికి తరలించాలని ఆమె పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

సదరు ఏనుగు పట్ల 'జూ' నిర్వహణాధికారులు అనుచితంగా ప్రవర్తించారని కూడా ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. దీని గురించి స్పందించాల్సిందిగా బీబీసీ, జూ అధికారులను సంప్రదించింది. కానీ వారు దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

దేశంలో బందీలుగా ఉన్న ఏనుగుల దుస్థితి గురించి అవగాహన కల్పించాలని ఈ పిటిషన్ ద్వారా కోరుకుంటున్నట్లు ధవన్ చెప్పారు.

''భారతీయ సంస్కృతిలో ఏనుగులకు ఉన్నతమైన హోదా ఉంటుంది. దేవాలయాల్లోనూ ఏనుగులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏనుగులు మన చరిత్రలో ఒక భాగం. అయినప్పటికీ, మనం వాటి పట్ల శ్రద్ధ వహించట్లేదు'' అని ధావన్ అన్నారు.

భారతదేశంలో దుర్భరమైన పరిస్థితుల్లో బంధీగా నివసిస్తన్న ఏనుగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని చాలా కాలంగా జంతు హక్కుల కార్యకర్తలు సూచిస్తున్నారు.

ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోని చాలా ఏనుగులను మతపరమైన కార్యక్రమాల్లో, బరువులు ఎత్తడానికి ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు వాటిని భిక్షాటనకు కూడా ఉపయోగిస్తున్నారు.

భారత్‌లోని జంతు ప్రదర్శనశాలల్లో బంధీగా ఉన్న రెండు ఆఫ్రికన్ ఏనుగుల్లో 'శంకర్' ఒకటి. మరొకటి కర్ణాటకలోని మైసూర్ 'జూ'లో ఉంది. ఇది కూడా మగ ఏనుగు.

'శంకర్'తో పాటు 'బొంబై' అనే మరో ఏనుగును కూడా 1998లో భారత్‌కు తీసుకువచ్చారు.

ఆసియా ఏనుగులతో పోల్చి చూస్తే... పెద్దగా, చాటంతా చెవులతో ఉండే ఈ రెండు ఆఫ్రికన్ గున్న ఏనుగులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ఏనుగులను అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు దౌత్యపరమైన బహుమతిగా జింబాబ్వే నుంచి పంపించారు.

ఆఫ్రికాలోని ఏ ప్రాంతం నుంచి ఈ ఏనుగులను తీసుకొచ్చారో తమకు తెలియదని జూ అధికారులు తెలిపారు.

కొన్నేళ్ల పాటు ఈ రెండు ఏనుగులు జంతు ప్రదర్శనశాలలో సౌకర్యంగానే తిరిగినట్లు కనిపించాయి.

కానీ 2005లో అనూహ్యంగా 'బొంబై' కన్నుమూసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆడ ఏనుగైన బొంబై మరణానికి గల కారణాలను బీబీసీ నిర్ధారించలేకపోయింది.

అప్పటినుంచి జూలో శంకర్ ఒంటరిగానే జీవితం గడుపుతోంది. ''ప్రస్తుతం 26 ఏళ్లకు పైగా వయస్సున్న శంకర్‌ను ఉక్కు స్థంభాలు, లోహపు కంచెలున్న చీకటి ఎన్‌క్లోజర్‌లో ఉంచారని'' నిఖితా ధావన్ పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో జంతు ప్రదర్శనశాలకు వెళ్లినప్పుడు అక్కడ శంకర్‌ను చూసిన తర్వాత దాని విడుదల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.

''ఆ ఏనుగు చాలా ధైన్యంగా కనిపించింది. దాని పరిస్థితి చూసి మేం చలించిపోయాం'' అని ఆమె చెప్పారు.

జూలో మరో రెండు ఆసియా ఏనుగులు కూడా ఉన్నాయి. వాటి పేర్లు లక్ష్మీ, హీరా. ఈ రెండింటిని శంకర్ నుంచి వేరుగా ఉంచారు.

ఈ ఆఫ్రికా ఏనుగుకు 'జూ' నుంచి విముక్తి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని నవంబర్‌లో 'జూ' డైరెక్టర్ సోనాలీ ఘోష్ వార్తా పత్రిక 'ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో చెప్పారు. తమ వద్ద ఉన్న ఏనుగును తీసుకెళ్లగలరా అని ఆఫ్రికాలోని పార్కుల యజమానులకు లేఖ రాసినట్లు ఆమె చెప్పారు.

జూలోని మూడు ఏనుగులను కలిపి ఉంచేందుకు అధికారులు ప్రయత్నించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ శంకర్‌కు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, అది చాలా మొండిదని జూ మాజీ డైరెక్టర్ రమేశ్ పాండే గతంలో చెప్పారు.

తన చుట్టూ కల్పించిన పరిస్థితుల కారణంగానే 'శంకర్' మొండిగా మారిపోయిందని జంతు హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

''మనుగడకు అనువుగా లేని పరిసరాల్లో దాన్ని ఉంచడం వల్లే దాని వైఖరి మొండిగా మారిపోయింది. ముఖ్యంగా ఆఫ్రికా మగ ఏనుగులు సామాజిక బంధాలను ఏర్పరచుకోగలవు'' అని లాభాపేక్ష లేని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా సంస్థ వైల్డ్‌లైఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శుభోబ్రోతో ఘోష్ అన్నారు.

అడవుల్లో నివసించే ఏనుగులు ఒకదానితో ఒకటి సన్నిహిత బంధాలను ఏర్పరచుకుంటాయి. 'జూ'ను ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దినా ఇలాంటి బంధాలను అవి ఏర్పరచుకోలేవు.

ఏనుగులను ఇరుకైన ఎన్‌క్లోజర్‌లలో ఉంచడం వల్ల వాటి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, తద్వారా అవి మానసిక రోగాల బారిన పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హీరా, లక్ష్మీ

ఏళ్లుగా శంకర్ అనుభవిస్తున్న క్లిష్టపరిస్థితులు... జంతు న్యాయవాద సమూహాలు, సహాయక బృందాల దృష్టిని ఆకర్షించాయి. ఇందులో భాగంగా యూకేకు చెందిన ఆస్పినల్ ఫౌండేషన్... ఆఫ్రికాలోని తగిన ప్రదేశంలో శంకర్‌కు పునరావాసం కల్పించడానికి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకొచ్చింది.

''జూ నుంచి ఏనుగును విడుదల చేసి, ఆఫ్రికన్ ఏనుగులు పుష్కలంగా జీవించే అభయారణ్యానికి లేదా వన్యప్రాణుల కేంద్రానికి తరలించాలని కోరుతూ'' ధావన్ ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. దీనిపై ఇప్పటివరకు 96,500 మందికి పైగా సంతకాలు చేశారు.

''ఒకవేళ శంకర్‌ను ఆఫ్రికాకు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తే.. ఈ వయస్సులో దాన్ని తరలించవచ్చో లేదో నిపుణులు పరీక్షించి చెప్పిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని'' ఘోష్ చెప్పారు.

శంకర్ కేసుతో ఏనుగుల్లాంటి తెలివైన జంతువులను కూడా బంధీగా ఉంచడం సరైనదేనా అనే పెద్ద ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన చెప్పారు.

''ఏనుగులు జంతుప్రదర్శనశాలల్లో అభివృద్ధి చెందలేవు. ప్రపంచవ్యాప్తంగా చాలా నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కాబట్టి వాటిని బంధించడం అంటే అసహజ ప్రదేశాల్లో వాటిని హింసించినట్లే'' అని ఘోష్ పేర్కొన్నారు.

జంతు ప్రదర్శనశాలల్లో ఏనుగుల ప్రదర్శనను 2009లో సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది. ఆరు నెలలకు పైగా ఏనుగును ఒంటరిగా ఉంచడాన్ని నిషేధించింది.

కానీ 'శంకర్' వంటి ఏనుగుల పరిస్థితిలో ఇలాంటి నిబంధనల వల్ల మార్పేమీ రాలేదని కార్యకర్తలు పేర్కొంటున్నారు.

''శంకర్ స్వేచ్ఛకు అనుకూలంగా వచ్చే తీర్పు చాలా మార్పులకు కారణమవుతుంది. ఈ కేసు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. భారతదేశంలో బంధీలుగా ఉన్న అన్ని ఏనుగులకు ఈ తీర్పుతో ప్రయోజనం కలుగుతుంది'' అని ఘోష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
A petition has been filed in the court seeking the return of an elephant given by Zimbabwe as a gift to the President
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X