నీలక్కల్ వద్ద అయ్యప్ప స్వామి భక్తుడిపై దూసుకెళ్లిన బస్సు
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. ఈ నెల 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు.
కిందటి నెల 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 24 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. 26వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు.

భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇటీవలే పత్తినంథిట్ట జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కొత్తగా పెళ్లయిన దంపతులు ఉండటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపినట్టయింది. మృతులను మథయ్ ఎప్పన్, అను, నిఖిల్, బిజూ జార్జ్‌గా గుర్తించారు.
మృతులు పత్తినంథిట్ట సమీపంలోని మలస్సేరి గ్రామానికి చెందిన వాళ్లు. పూనలూర్- మువట్టుపుజ రోడ్డుపై వారు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. కూడల్ సమీపంలోని మురింజకల్ వద్ద ఎదురుగా వస్తోన్న అయ్యప్ప స్వాముల బస్సును అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మథయ్ ఎప్పన్, నిఖిల్, బిజూ జార్జ్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు.
ఇప్పుడు తాజాగా మరో దుర్ఘటన సంభవించింది. అయ్యప్ప స్వామి భక్తుడొకరు దుర్మరణం పాలయ్యారు. ఆయనను తమిళనాడుకు చెందిన గోపీనాథ్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం నీలక్కల్ ఆసుపత్రికి తరలించారు.

25 సంవత్సరాల తమిళనాడుకు చెందిన భక్తుడు. తిరువళ్లూరు జిల్లాలోని పూన్నపాక్కం. సన్నిధానానికి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని నీలక్కల్‌కు చేరుకున్నాడు. స్వస్థలానికి బయలుదేరి వెళ్లడానికి నీలక్కల్ వద్ద నంబర్ 10 పార్కింగ్ స్థలంలో బస్సు కోసం ఎదురు చూస్తూ అక్కడే నిద్రపోయాడు.
తమిళనాడు నుంచి శబరిమల భక్తులతో వచ్చిన బస్సు పార్కింగ్ స్థలంలో రివర్స్ తీసుకునే సమయంలో దురదృష్టవశావత్తూ నిద్రిస్తోన్న గోపీనాథ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకని మృతదేహాన్ని నీలక్కల్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications